Call of the Wild (2020)— సినిమా పరిచయం

నా దగ్గర జాక్ లండన్ రాసిన Lone Wolf పుస్తకం చాలారోజులు ఉంది!

నేను B.A లో కొనుక్కుని ….. పూర్తిగా చదవలేకపోయిన పుస్తకం!

అప్పుడప్పుడే తెలుగు మీడియం నుండి ఇంగ్లీష్ మీడియంలో చేరి ఇంగ్లీష్ పుస్తకాలు చదవాలనే ఆరాటం!

కానీ ….. అది ఏదో కొంత అర్థమై ….. అర్థం కానట్టు ….. ఆ పుస్తకం నాతోపాటు కొంతకాలం ఉండి మాయమైపోయింది!

తర్వాత జాక్ లండన్ మరో పుస్తకం Call of the Wild ను “అడవి పిలిచింది” నవలగా అనువదించారని కొన్ని సమీక్షలు చదవడం!

తుమ్మేటి రఘోత్తమ రెడ్డి గారు వారి “గూఫీ” పుస్తకంలో కూడా ఆ నవలను ప్రస్తావించడం ….. ఇవన్నీ నావరకు నాకు ఈ సినిమా చూడడానికి కారణం!

చాల రోజుల తర్వాత ఓ మంచి సినిమా చూశాను అన్న తృప్తి మిగిలిపోయింది.

*****

(కథాంశం)

———–

బక్ ఓ శునకం!

అతడే కథానాయకుడు! ….. భారీ శరీరంతో ఉండే బక్ ….. ‘సెయింట్ బెర్నార్డ్ – స్కాచ్ కాలి’ సంకరజాతి శునకం.

ఆరంభంలో కథాస్థలం ….. అమెరికా దేశపు కాలిఫోర్నియా రాష్ట్రంలోని సాంతాక్లారా.

కాలం ….. 19 వ శతాబ్దపు చివరి దశ. సినిమా ఆరంభంలో ….. సాంతాక్లారాలోని అంగడిలో సరుకులు కొంటున్న తన యజమానితో ఉన్న బక్ ఓ దుండగుని కంట్లో పడుతుంది.

….. యజమాని ఇంట్లో హాయిగా కాలం గడుపుతున్న బక్ ను దొంగిలించి నౌకలో కెనడాకు తరలిస్తారు దుండగులు.

అక్కడినుండి మొదలవుతాయి బక్ కష్టాలు.

మొదటిసారిగా క్రమశిక్షణ పేరుతో నౌకలోనే దండన మొదలవుతుంది. తను ఎక్కడ ఉన్నదో, ఎక్కడికి వెళ్తున్నదో తెలియని బక్ ….. ఆ హింసకు లొంగవలసివస్తుంది.

నౌక దిగిన తర్వాత జాన్ థార్న్టన్ (పాత్రధారి: హారిసన్ ఫోర్డ్) అనే ముసలాయనకు ….. అతని జేబులోనుండి పడిపోయిన మౌత్ ఆర్గాన్ (నోటితో ఊదే హార్మోనియం) ను పరుగెత్తుకువెళ్లి అందజేస్తుంది. ఆ తర్వాత బక్ ను అక్కడే ….. కెనడాలోని యూకాన్ అనే ప్రాంతానికి మెయిల్ (పోస్ట్) తీసుకువెళ్ళే పెర్రాల్ట్, అతని అసిస్టెంట్ ఫ్రాంకాయిసి కి అమ్మివేస్తారు.

ఆర్కిటిక్ ప్రాంతంలో ఉండే యూకాన్ లో జనాభా తక్కువ. సంవత్సరంలో ఎక్కువ భాగం మంచుతో కప్పబడి ఉంటుంది. దగ్గర్లోనే బంగారు నిక్షేపాలు విరివిగా ఉన్నాయనే నెపంతోనూ ….. వేసవిలో విహారయాత్రలకూనూ ….. అక్కడికి పర్యాటకులు వచ్చిపోతూంటారు. మంచుకురుస్తున్న కాలమంతా అక్కడికి వెళ్ళడానికి మంచుపై నడిచే స్లెడ్జ్ లే శరణ్యం. ఆ స్లెడ్జ్ బళ్ళను లాగడానికి శునకాలు వారికి ఓ వరం. ఆ పరిస్థితుల్లోనే పెర్రాల్ట్, ఫ్రాంకాయిసి ….. యూకాన్ కు మెయిల్ తీసుకువెళ్ళే తమ స్లెడ్జ్ కోసం బక్ ను కొనుగోలుజేస్తారు.

వారి స్లెడ్జ్ లాగే శునక సముదాయానికి స్పిట్జ్ అనే శునకం నాయకుడు. స్వతహాగా సున్నితమనస్కుడైన బక్ ….. శునకపు సహజ లక్షణం ప్రకారం ఒక కుందేలును పట్టుకుంటుంది. కానీ ఆ తర్వాత ….. కాసేపు ఆడుకుని విడిచిపెడుతుంది. అయితే ….. ఆ కుందేలును స్పిట్జ్ చంపివేస్తుంది. అప్పుడు జరిగిన పోట్లాటలో బక్ ….. స్పిట్జ్ ను ఓడిస్తుంది. ఓడిపోయిన స్పిట్జ్ అరణ్యంలోకి పారిపోతాడు. ఇక బక్ యే నాయకుడు. “గుంపుకు ఒక్కడే నాయకుడు.”

ఈ క్రమంలో బక్ కు ….. తమ పూర్వీకులు ….. ఒక నల్లటి నక్క రూపంలో ….. బక్ కు సాక్షాత్కరిస్తూ మార్గనిర్దేశం చేస్తూ ఉంటారు.

84 రోజులు ….. 2,400 మైళ్ళ ప్రయాణంలో …..స్లెడ్జ్ బండి లాగుతున్న క్రమంలో ….. బక్ గమ్యం నెమ్మదిగా రూపుదిద్దుకుంటూ ఉంటుంది. బక్ వ్యక్తిత్వం బయటపడుతుంది. దయచేసి ….. మనుషులకు ఆపాదించేదే వ్యక్తిత్వం అనుకోకండి. ఇక్కడ శునకత్వం ….. లేదా శునకపు వ్యక్తిత్వం అనేది ఏమిటో ….. మానవుల క్ర్రూరత్వం ఏమిటో ….. తమకు కావల్సినదానిని పొందడానికి మానవులు ఎంతదూరం అయినా వెళ్ళగలరని, ఎంతటి నీచత్వానికి అయినా దిగజారగలరని చెప్పే ప్రయత్నమే ….. మూలకథ రచయిత జాక్ లండన్ పుస్తకం అయివుంటుంది. సినిమా కోసం ….. ప్రేక్షకులను దృశ్యరూపంలో ఆకట్టుకోవడానికి ….. లేదా మార్కెటింగ్ చేసుకోవడానికి ….. మూలకథనుండి కొంత వేర్పాటు ఉండడం అనివార్యం, అవసరం కూడా అయివుండవచ్చు.

పెర్రాల్ట్, ఫ్రాంకాయిసి ….. మెయిల్ తీసుకువెళ్ళే పని ఇక లేదని తెలిసినప్పుడు ….. బక్ ను అమ్మివేస్తారు. కానీ, క్రూరుడైన ఆ కొనుగోలుదారునుండి బక్ ను అప్పటికే అక్కడ ఉంటున్న జాన్ థార్న్టన్ విముక్తి చేస్తాడు. అప్పటినుండి, అతనితోనే ఉండిపోయి ….. చివరకు అడవిలోని తన పూర్వ జాతి జంతువులతో ప్రేమ, స్నేహంలో పడి ….. “అడవి పిలుపు (Call of the Wild) ను అందుకుంటుంది.

కథ అంతా చెప్పి ….. ఈ పరిచయ చదువరులైన ….. మీ ఆనందాన్ని చెడగొట్టలేను.

కానీ ఆద్యంతమూ తలతిప్పడానికి కూడా వీలులేకుండా ….. కరుణ, జాలి, సంవేదన, సహానుభూతి, ప్రేమ, ఆనందం, కోపం, దైన్యం, బాధ….. ఇలా ఫ్రేము ఫ్రేములో బక్ ముఖంలో ద్యోతకమయ్యే ….. అనేక అనుభూతులను చూపిస్తూ ….. సాగిపోయే ఈ దృశ్యకావ్యం ….. ఇప్పటి అసమాన్యమైన సాంకేతికతో రూపుదిద్దుకోవడం ….. దానిని మనకు అందించడంలో దర్శకుడు, సాంకేతిక బృందాలు చాలా కష్టపడివుంటాయి.

బక్ ద్వారా ….. జాక్ లండన్ ….. మానవుల్లోని జంతుప్రవృత్తిని ….. మానవులు కోల్పోయిన, కోల్పోతున్న మానవ విలువలను గుర్తుచేస్తాడు. పుస్తకంలో ఎట్లా ఉన్నదో నాకు తెలియదు. కానీ, మెయిల్స్ తీసుకువెళ్ళవలిసిన పని ఎంత అవసరమో బక్ కు వివరిస్తూ పెర్రాల్ట్ ఇలా అంటాడు: “చూడు బక్! మనము కేవలం మెయిల్స్ తీసుకువెళ్ళము. మనము జీవితాన్ని తీసికెళ్తాము. మనం ఆశల్ని తీసికెళ్తాము ….. ప్రేమను తీసికెళ్తాము.”

నక్కల సంతతికి చెందిన శునకాలను మచ్చికచేసుకుని, పెంపుడు జంతువులుగా మార్చిన తర్వాత ….. మానవుని క్రూరత్వానికి, దాష్టీకానికి బలైపోయే మూగజీవుల ప్రతినిధిగా బక్ కు అరణ్యాన్ని చూపిస్తూ ….. జాన్ థార్న్టన్ “నీవు నీ ఇంటికి వచ్చావు.” అని అంటూ ప్రేక్షకులతో “అతను (బక్) పిలుపును విన్నాడు ….. అడవి పిలుపును.” అంటాడు.

అరణ్యాల్లోని సల్లక్షణాలు కలిగిన జంతువులను మచ్చికచేసుకుని ….. మానవుడు తన దుర్లక్షణాలను ఏ విధంగా బహిర్గతపరుస్తాడో ….. కేవలం కడుపు నిండుతే చాలనుకునే మూగజీవులను మనం ఎంతటి దుర్గతికి ఈడుస్తున్నామో మళ్ళీ ఒక్కసారి గుర్తుకుతెచ్చే ఈ సినిమా ఒక మాసిపోలేని ముద్రను మన మనఃఫలకాలపై ముద్రిస్తుంది.

******

ఉపసంహారం

————-

ఇదే నవల ఇతివృత్తంగా ….. ఇదే పేరుతో ….. మొత్తం 7 సినిమాలు తీయబడ్డాయి!

మొట్టమొదటిది 1923 లో తీయబడిన మూకీ ….. (silent movie) ….. ఆ తర్వాత వరుసగా, 1935, 1972, 1976, 1997, 2009 లో తీయబడినవి. ఇందులో 1997 లో తీసిన సినిమా Call of the Wild: Dog of the Yukon అనే పేరుతో తీయబడింది.

ఇదిగాక, Animal Planet లో సీరియల్ గా 13 ఎపిసోడ్లు ప్రసారం చేయబడ్డాయి. అవి DVD రూపంలో దొరుకుతాయి.

2020 లో తీయబడిన ఈ సినిమా 20th Century Fox Presentations వారి ద్వారా తీయబడింది. కానీ 150 మిలియన్ డాలర్ల పెట్టుబడితో తీసిన ఈ సినిమా నిర్మాతలకు మాత్రం కేవలం 107 మిలియన్ డాలర్లను మాత్రమే తెచ్చిపెట్టిందట. ఆ కారణం చేత ….. ప్రపంచవ్యాప్తంగా సినిమాహాళ్ళు మూతబడడం వల్ల ఈ జనవరిలోనే విడుదలైన ఈ సినిమాను అమెజాన్ ప్రైంలో చూడడానికి వీలు కల్పించారు.

ఈ క్రింది లింక్ నొక్కి, యూట్యూబ్ లో ఈ సినిమా ట్రైలర్ చూడవచ్చు.

##########################

చింతకుంట్ల సంపత్ రెడ్డి

ఫ్రీమాంట్, కాలిఫోర్నియా, అమెరికా నుండి

04 ఏప్రిల్ 2020

About saltnpepperdays

I am an EFL/ESL teacher from India. I am interested in teaching/learning to teach English. Photography and reading are my hobbies.
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

Leave a comment