ఉత్తరం-6: నీవొక్కడివే యుద్దాన్ని ఆపగలవు

ఉత్తరాలు-ఉపన్యాసాలు-11
=====================
ఉత్తరం-6: నీవొక్కడివే యుద్దాన్ని ఆపగలవు
రచయిత: ఎం.కె.గాంధి
స్వేచ్చానువాదం: చింతకుంట్ల సంపత్ రెడ్డి
మూలం: ఇంగ్లీష్
================================

నేపథ్యం:
————
మానవజాతికి పోరాటాలు, యుద్దాలు కొత్త కాదు.
కానీ, శాస్త్రవిజ్ఞానం తోడయి ……. రెండవ ప్రపంచ యుద్ధం సృష్టించిన మారణహోమం అంతా ఇంతా కాదు.

ఆ యుద్దానికి ప్రధాన కారకుడు అడాల్ఫ్ హిట్లర్.

ఆ యుద్ద మేఘాలు అలుముకొన్న దశలో … యుద్ధ ప్రారంభానికి కొద్దికాలం ముందుగా … యుద్ధం మానివేయమని సలహా ఇస్తూ గాంధిజీ హిట్లర్ కు రాసిన ఉత్తరం ఇది. 1939 జూలై 23 న రాసిన ఈ ఉత్తరం కాకుండా మరో ఉత్తరాన్ని కూడా 1940 లో గాంధిజీ హిట్లర్ కు రాసారు. కానీ, ఆ రెండింటిని హిట్లర్ కు చేరకుండా బ్రిటిష్ వారు నిరోధించారు.

హింస, అహింసలు …..
హిట్లర్, గాంధి ….. రెండు భిన్న ధ్రువాలు.

రెండవ ప్రపంచ యుద్ధంలో విధ్వంసకాండకు తోడ్పడిన అణుబాంబు ఆవిష్కర్త, ఆల్బర్ట్ ఐన్స్టీన్ ….. గాంధి 70 వ జన్మదిన సందర్బంగా గాంధి గురించి ప్రస్తావిస్తూ, “రానున్న తరాలవారు ఇట్లాంటి మనిషి ఒకరు రక్తమాంసాలతో ఈ భూమ్మీద నడయాడినాడంటే ….. బహుశా నమ్మలేరు.” అంటాడు.

“అడాల్ఫ్ హిట్లర్” అనే పేరిట హిట్లర్ జీవిత చరిత్రను రాసిన జేమ్స్ బంటింగ్, ఆ పుస్తకం చివరి వాక్యాలుగా “ఈ యుగంలో పుట్టిన అత్యంత నిరంకుశుడు చనిపోయాడు, పూడ్చిపెట్టబడ్డాడు. అతనిలాంటి మరో వ్యక్తి పుట్టకుండా వుండాలని ఆశిద్దాం.” అని రాసాడు.

●◆●
(ఉత్తరం)
————

భారత దేశం
వార్ధా నుండి
23.7.’39

ప్రియ మిత్రమా,

మానవాళి శ్రేయస్సు కోసం నీకో లేఖ రాయమని స్నేహితులు ఒత్తిడి చేస్తున్నారు. కానీ, వారి కోరికను నేను అణచుకొన్నాను. ఎందుకంటే, నా లేఖ ఎలాంటిది అయినా అది అసంబద్ధం అయినదే అయి వుంటుంది. నా విజ్ఞప్తి యోగ్యత ఎట్లా వున్నప్పటికీ ఆ విషయాన్ని పట్టించుకోనక్కర్లేదని నాకు ఏదో ఉద్భోదిస్తున్నది.

మానవాళిని ఆటవిక రాజ్యంగా మార్చగలిగే యుద్దాన్ని ప్రపంచంలో నీవొక్కడివే ఆపగలవనేది నిర్వివాదాంశం. నీకు ఎంతటి విలువైనది అనిపించినా సరే, అంతటి మూల్యాన్ని నీవు చెల్లించాలా? ఎలాంటి విజయం సాధించకుండా యుద్దమార్గాన్ని ఉద్దేశ్యపూర్వకంగా వదలిపీట్టిన నా అభ్యర్థనను మన్నిస్తావా? ఏదైనా సరే, నీకు ఇలా రాయడంలో నేను పొరపాటుపడివుంటే, నన్ను మన్నిస్తావని ఆశిస్తున్నాను.

సెలవు,
నీ విశ్వాస మిత్రుడు
ఎం.కె.గాంధి

హెర్ హిట్లర్
బెర్లిన్
జర్మని

●◆●

ముగింపు:
———–
కాకతాళియంగా ఈ రోజు స్వాతంత్ర్య దినోత్సవం. స్వాతంత్ర్య పోరాటంలో గాంధీజీ పాత్ర అందరికీ తెలిసిందే.

రిచర్డ్ అటెన్బరో తీసిన “గాంధి” సినిమా చూసిన తర్వాత నాకు అనిపించేదేమిటంటే ….. గాంధి పుట్టిన దేశంలో ఆయన గురించి ఎన్నెన్నో మాటలు చెప్పుకునే మనం …… ఓ బ్రిటిష్ జాతీయుడైన అటెన్బరో లాగ ….. కొన్ని దశాబ్దాల పాటు ఎందుకు ఓ గొప్ప సినిమా తీయలేకపోయాము …… అని.

నేను వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో బి.ఏ చదువుతున్న రోజుల్లో …… “వకీల్” గారు అనే లెక్చరర్ మాకు పొలిటికల్ సైన్స్ చెప్పేవారు. ఆయన పొట్టి మనిషి. “నా కన్నా హిట్లర్ రెండు ఇంచులు ఎత్తు తక్కువ.” అని సరదాగా చెప్తూండేవాడు.

#########################
చింతకుంట్ల సంపత్ రెడ్డి
గురువారం, 15 ఆగస్టు 2019

About saltnpepperdays

I am an EFL/ESL teacher from India. I am interested in teaching/learning to teach English. Photography and reading are my hobbies.
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

Leave a comment