మంచు ధూళి

—రాబర్ట్ ఫ్రాస్ట్

   అనుసృజన: చింతకుంట్ల సంపత్ రెడ్డి    

అనుసృజన: చింతకుంట్ల సంపత్ రెడ్డి


ఓ పక్షి విదిలించిన
కొమ్మ నుండి
నాపై జారిన మంచు ధూళి

నేను తిట్టుకుంటూ
ఉన్న ఆ రోజులోని
కొంత భాగాన్నైనా మిగిల్చి
నా హృదయాన్ని తేలికపరిచింది.

Posted in Uncategorized | Tagged | Leave a comment

ఉత్తరం-6: నీవొక్కడివే యుద్దాన్ని ఆపగలవు

ఉత్తరాలు-ఉపన్యాసాలు-11
=====================
ఉత్తరం-6: నీవొక్కడివే యుద్దాన్ని ఆపగలవు
రచయిత: ఎం.కె.గాంధి
స్వేచ్చానువాదం: చింతకుంట్ల సంపత్ రెడ్డి
మూలం: ఇంగ్లీష్
================================

నేపథ్యం:
————
మానవజాతికి పోరాటాలు, యుద్దాలు కొత్త కాదు.
కానీ, శాస్త్రవిజ్ఞానం తోడయి ……. రెండవ ప్రపంచ యుద్ధం సృష్టించిన మారణహోమం అంతా ఇంతా కాదు.

ఆ యుద్దానికి ప్రధాన కారకుడు అడాల్ఫ్ హిట్లర్.

ఆ యుద్ద మేఘాలు అలుముకొన్న దశలో … యుద్ధ ప్రారంభానికి కొద్దికాలం ముందుగా … యుద్ధం మానివేయమని సలహా ఇస్తూ గాంధిజీ హిట్లర్ కు రాసిన ఉత్తరం ఇది. 1939 జూలై 23 న రాసిన ఈ ఉత్తరం కాకుండా మరో ఉత్తరాన్ని కూడా 1940 లో గాంధిజీ హిట్లర్ కు రాసారు. కానీ, ఆ రెండింటిని హిట్లర్ కు చేరకుండా బ్రిటిష్ వారు నిరోధించారు.

హింస, అహింసలు …..
హిట్లర్, గాంధి ….. రెండు భిన్న ధ్రువాలు.

రెండవ ప్రపంచ యుద్ధంలో విధ్వంసకాండకు తోడ్పడిన అణుబాంబు ఆవిష్కర్త, ఆల్బర్ట్ ఐన్స్టీన్ ….. గాంధి 70 వ జన్మదిన సందర్బంగా గాంధి గురించి ప్రస్తావిస్తూ, “రానున్న తరాలవారు ఇట్లాంటి మనిషి ఒకరు రక్తమాంసాలతో ఈ భూమ్మీద నడయాడినాడంటే ….. బహుశా నమ్మలేరు.” అంటాడు.

“అడాల్ఫ్ హిట్లర్” అనే పేరిట హిట్లర్ జీవిత చరిత్రను రాసిన జేమ్స్ బంటింగ్, ఆ పుస్తకం చివరి వాక్యాలుగా “ఈ యుగంలో పుట్టిన అత్యంత నిరంకుశుడు చనిపోయాడు, పూడ్చిపెట్టబడ్డాడు. అతనిలాంటి మరో వ్యక్తి పుట్టకుండా వుండాలని ఆశిద్దాం.” అని రాసాడు.

●◆●
(ఉత్తరం)
————

భారత దేశం
వార్ధా నుండి
23.7.’39

ప్రియ మిత్రమా,

మానవాళి శ్రేయస్సు కోసం నీకో లేఖ రాయమని స్నేహితులు ఒత్తిడి చేస్తున్నారు. కానీ, వారి కోరికను నేను అణచుకొన్నాను. ఎందుకంటే, నా లేఖ ఎలాంటిది అయినా అది అసంబద్ధం అయినదే అయి వుంటుంది. నా విజ్ఞప్తి యోగ్యత ఎట్లా వున్నప్పటికీ ఆ విషయాన్ని పట్టించుకోనక్కర్లేదని నాకు ఏదో ఉద్భోదిస్తున్నది.

మానవాళిని ఆటవిక రాజ్యంగా మార్చగలిగే యుద్దాన్ని ప్రపంచంలో నీవొక్కడివే ఆపగలవనేది నిర్వివాదాంశం. నీకు ఎంతటి విలువైనది అనిపించినా సరే, అంతటి మూల్యాన్ని నీవు చెల్లించాలా? ఎలాంటి విజయం సాధించకుండా యుద్దమార్గాన్ని ఉద్దేశ్యపూర్వకంగా వదలిపీట్టిన నా అభ్యర్థనను మన్నిస్తావా? ఏదైనా సరే, నీకు ఇలా రాయడంలో నేను పొరపాటుపడివుంటే, నన్ను మన్నిస్తావని ఆశిస్తున్నాను.

సెలవు,
నీ విశ్వాస మిత్రుడు
ఎం.కె.గాంధి

హెర్ హిట్లర్
బెర్లిన్
జర్మని

●◆●

ముగింపు:
———–
కాకతాళియంగా ఈ రోజు స్వాతంత్ర్య దినోత్సవం. స్వాతంత్ర్య పోరాటంలో గాంధీజీ పాత్ర అందరికీ తెలిసిందే.

రిచర్డ్ అటెన్బరో తీసిన “గాంధి” సినిమా చూసిన తర్వాత నాకు అనిపించేదేమిటంటే ….. గాంధి పుట్టిన దేశంలో ఆయన గురించి ఎన్నెన్నో మాటలు చెప్పుకునే మనం …… ఓ బ్రిటిష్ జాతీయుడైన అటెన్బరో లాగ ….. కొన్ని దశాబ్దాల పాటు ఎందుకు ఓ గొప్ప సినిమా తీయలేకపోయాము …… అని.

నేను వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో బి.ఏ చదువుతున్న రోజుల్లో …… “వకీల్” గారు అనే లెక్చరర్ మాకు పొలిటికల్ సైన్స్ చెప్పేవారు. ఆయన పొట్టి మనిషి. “నా కన్నా హిట్లర్ రెండు ఇంచులు ఎత్తు తక్కువ.” అని సరదాగా చెప్తూండేవాడు.

#########################
చింతకుంట్ల సంపత్ రెడ్డి
గురువారం, 15 ఆగస్టు 2019

Posted in Uncategorized | Leave a comment

Call of the Wild (2020)— సినిమా పరిచయం

నా దగ్గర జాక్ లండన్ రాసిన Lone Wolf పుస్తకం చాలారోజులు ఉంది!

నేను B.A లో కొనుక్కుని ….. పూర్తిగా చదవలేకపోయిన పుస్తకం!

అప్పుడప్పుడే తెలుగు మీడియం నుండి ఇంగ్లీష్ మీడియంలో చేరి ఇంగ్లీష్ పుస్తకాలు చదవాలనే ఆరాటం!

కానీ ….. అది ఏదో కొంత అర్థమై ….. అర్థం కానట్టు ….. ఆ పుస్తకం నాతోపాటు కొంతకాలం ఉండి మాయమైపోయింది!

తర్వాత జాక్ లండన్ మరో పుస్తకం Call of the Wild ను “అడవి పిలిచింది” నవలగా అనువదించారని కొన్ని సమీక్షలు చదవడం!

తుమ్మేటి రఘోత్తమ రెడ్డి గారు వారి “గూఫీ” పుస్తకంలో కూడా ఆ నవలను ప్రస్తావించడం ….. ఇవన్నీ నావరకు నాకు ఈ సినిమా చూడడానికి కారణం!

చాల రోజుల తర్వాత ఓ మంచి సినిమా చూశాను అన్న తృప్తి మిగిలిపోయింది.

*****

(కథాంశం)

———–

బక్ ఓ శునకం!

అతడే కథానాయకుడు! ….. భారీ శరీరంతో ఉండే బక్ ….. ‘సెయింట్ బెర్నార్డ్ – స్కాచ్ కాలి’ సంకరజాతి శునకం.

ఆరంభంలో కథాస్థలం ….. అమెరికా దేశపు కాలిఫోర్నియా రాష్ట్రంలోని సాంతాక్లారా.

కాలం ….. 19 వ శతాబ్దపు చివరి దశ. సినిమా ఆరంభంలో ….. సాంతాక్లారాలోని అంగడిలో సరుకులు కొంటున్న తన యజమానితో ఉన్న బక్ ఓ దుండగుని కంట్లో పడుతుంది.

….. యజమాని ఇంట్లో హాయిగా కాలం గడుపుతున్న బక్ ను దొంగిలించి నౌకలో కెనడాకు తరలిస్తారు దుండగులు.

అక్కడినుండి మొదలవుతాయి బక్ కష్టాలు.

మొదటిసారిగా క్రమశిక్షణ పేరుతో నౌకలోనే దండన మొదలవుతుంది. తను ఎక్కడ ఉన్నదో, ఎక్కడికి వెళ్తున్నదో తెలియని బక్ ….. ఆ హింసకు లొంగవలసివస్తుంది.

నౌక దిగిన తర్వాత జాన్ థార్న్టన్ (పాత్రధారి: హారిసన్ ఫోర్డ్) అనే ముసలాయనకు ….. అతని జేబులోనుండి పడిపోయిన మౌత్ ఆర్గాన్ (నోటితో ఊదే హార్మోనియం) ను పరుగెత్తుకువెళ్లి అందజేస్తుంది. ఆ తర్వాత బక్ ను అక్కడే ….. కెనడాలోని యూకాన్ అనే ప్రాంతానికి మెయిల్ (పోస్ట్) తీసుకువెళ్ళే పెర్రాల్ట్, అతని అసిస్టెంట్ ఫ్రాంకాయిసి కి అమ్మివేస్తారు.

ఆర్కిటిక్ ప్రాంతంలో ఉండే యూకాన్ లో జనాభా తక్కువ. సంవత్సరంలో ఎక్కువ భాగం మంచుతో కప్పబడి ఉంటుంది. దగ్గర్లోనే బంగారు నిక్షేపాలు విరివిగా ఉన్నాయనే నెపంతోనూ ….. వేసవిలో విహారయాత్రలకూనూ ….. అక్కడికి పర్యాటకులు వచ్చిపోతూంటారు. మంచుకురుస్తున్న కాలమంతా అక్కడికి వెళ్ళడానికి మంచుపై నడిచే స్లెడ్జ్ లే శరణ్యం. ఆ స్లెడ్జ్ బళ్ళను లాగడానికి శునకాలు వారికి ఓ వరం. ఆ పరిస్థితుల్లోనే పెర్రాల్ట్, ఫ్రాంకాయిసి ….. యూకాన్ కు మెయిల్ తీసుకువెళ్ళే తమ స్లెడ్జ్ కోసం బక్ ను కొనుగోలుజేస్తారు.

వారి స్లెడ్జ్ లాగే శునక సముదాయానికి స్పిట్జ్ అనే శునకం నాయకుడు. స్వతహాగా సున్నితమనస్కుడైన బక్ ….. శునకపు సహజ లక్షణం ప్రకారం ఒక కుందేలును పట్టుకుంటుంది. కానీ ఆ తర్వాత ….. కాసేపు ఆడుకుని విడిచిపెడుతుంది. అయితే ….. ఆ కుందేలును స్పిట్జ్ చంపివేస్తుంది. అప్పుడు జరిగిన పోట్లాటలో బక్ ….. స్పిట్జ్ ను ఓడిస్తుంది. ఓడిపోయిన స్పిట్జ్ అరణ్యంలోకి పారిపోతాడు. ఇక బక్ యే నాయకుడు. “గుంపుకు ఒక్కడే నాయకుడు.”

ఈ క్రమంలో బక్ కు ….. తమ పూర్వీకులు ….. ఒక నల్లటి నక్క రూపంలో ….. బక్ కు సాక్షాత్కరిస్తూ మార్గనిర్దేశం చేస్తూ ఉంటారు.

84 రోజులు ….. 2,400 మైళ్ళ ప్రయాణంలో …..స్లెడ్జ్ బండి లాగుతున్న క్రమంలో ….. బక్ గమ్యం నెమ్మదిగా రూపుదిద్దుకుంటూ ఉంటుంది. బక్ వ్యక్తిత్వం బయటపడుతుంది. దయచేసి ….. మనుషులకు ఆపాదించేదే వ్యక్తిత్వం అనుకోకండి. ఇక్కడ శునకత్వం ….. లేదా శునకపు వ్యక్తిత్వం అనేది ఏమిటో ….. మానవుల క్ర్రూరత్వం ఏమిటో ….. తమకు కావల్సినదానిని పొందడానికి మానవులు ఎంతదూరం అయినా వెళ్ళగలరని, ఎంతటి నీచత్వానికి అయినా దిగజారగలరని చెప్పే ప్రయత్నమే ….. మూలకథ రచయిత జాక్ లండన్ పుస్తకం అయివుంటుంది. సినిమా కోసం ….. ప్రేక్షకులను దృశ్యరూపంలో ఆకట్టుకోవడానికి ….. లేదా మార్కెటింగ్ చేసుకోవడానికి ….. మూలకథనుండి కొంత వేర్పాటు ఉండడం అనివార్యం, అవసరం కూడా అయివుండవచ్చు.

పెర్రాల్ట్, ఫ్రాంకాయిసి ….. మెయిల్ తీసుకువెళ్ళే పని ఇక లేదని తెలిసినప్పుడు ….. బక్ ను అమ్మివేస్తారు. కానీ, క్రూరుడైన ఆ కొనుగోలుదారునుండి బక్ ను అప్పటికే అక్కడ ఉంటున్న జాన్ థార్న్టన్ విముక్తి చేస్తాడు. అప్పటినుండి, అతనితోనే ఉండిపోయి ….. చివరకు అడవిలోని తన పూర్వ జాతి జంతువులతో ప్రేమ, స్నేహంలో పడి ….. “అడవి పిలుపు (Call of the Wild) ను అందుకుంటుంది.

కథ అంతా చెప్పి ….. ఈ పరిచయ చదువరులైన ….. మీ ఆనందాన్ని చెడగొట్టలేను.

కానీ ఆద్యంతమూ తలతిప్పడానికి కూడా వీలులేకుండా ….. కరుణ, జాలి, సంవేదన, సహానుభూతి, ప్రేమ, ఆనందం, కోపం, దైన్యం, బాధ….. ఇలా ఫ్రేము ఫ్రేములో బక్ ముఖంలో ద్యోతకమయ్యే ….. అనేక అనుభూతులను చూపిస్తూ ….. సాగిపోయే ఈ దృశ్యకావ్యం ….. ఇప్పటి అసమాన్యమైన సాంకేతికతో రూపుదిద్దుకోవడం ….. దానిని మనకు అందించడంలో దర్శకుడు, సాంకేతిక బృందాలు చాలా కష్టపడివుంటాయి.

బక్ ద్వారా ….. జాక్ లండన్ ….. మానవుల్లోని జంతుప్రవృత్తిని ….. మానవులు కోల్పోయిన, కోల్పోతున్న మానవ విలువలను గుర్తుచేస్తాడు. పుస్తకంలో ఎట్లా ఉన్నదో నాకు తెలియదు. కానీ, మెయిల్స్ తీసుకువెళ్ళవలిసిన పని ఎంత అవసరమో బక్ కు వివరిస్తూ పెర్రాల్ట్ ఇలా అంటాడు: “చూడు బక్! మనము కేవలం మెయిల్స్ తీసుకువెళ్ళము. మనము జీవితాన్ని తీసికెళ్తాము. మనం ఆశల్ని తీసికెళ్తాము ….. ప్రేమను తీసికెళ్తాము.”

నక్కల సంతతికి చెందిన శునకాలను మచ్చికచేసుకుని, పెంపుడు జంతువులుగా మార్చిన తర్వాత ….. మానవుని క్రూరత్వానికి, దాష్టీకానికి బలైపోయే మూగజీవుల ప్రతినిధిగా బక్ కు అరణ్యాన్ని చూపిస్తూ ….. జాన్ థార్న్టన్ “నీవు నీ ఇంటికి వచ్చావు.” అని అంటూ ప్రేక్షకులతో “అతను (బక్) పిలుపును విన్నాడు ….. అడవి పిలుపును.” అంటాడు.

అరణ్యాల్లోని సల్లక్షణాలు కలిగిన జంతువులను మచ్చికచేసుకుని ….. మానవుడు తన దుర్లక్షణాలను ఏ విధంగా బహిర్గతపరుస్తాడో ….. కేవలం కడుపు నిండుతే చాలనుకునే మూగజీవులను మనం ఎంతటి దుర్గతికి ఈడుస్తున్నామో మళ్ళీ ఒక్కసారి గుర్తుకుతెచ్చే ఈ సినిమా ఒక మాసిపోలేని ముద్రను మన మనఃఫలకాలపై ముద్రిస్తుంది.

******

ఉపసంహారం

————-

ఇదే నవల ఇతివృత్తంగా ….. ఇదే పేరుతో ….. మొత్తం 7 సినిమాలు తీయబడ్డాయి!

మొట్టమొదటిది 1923 లో తీయబడిన మూకీ ….. (silent movie) ….. ఆ తర్వాత వరుసగా, 1935, 1972, 1976, 1997, 2009 లో తీయబడినవి. ఇందులో 1997 లో తీసిన సినిమా Call of the Wild: Dog of the Yukon అనే పేరుతో తీయబడింది.

ఇదిగాక, Animal Planet లో సీరియల్ గా 13 ఎపిసోడ్లు ప్రసారం చేయబడ్డాయి. అవి DVD రూపంలో దొరుకుతాయి.

2020 లో తీయబడిన ఈ సినిమా 20th Century Fox Presentations వారి ద్వారా తీయబడింది. కానీ 150 మిలియన్ డాలర్ల పెట్టుబడితో తీసిన ఈ సినిమా నిర్మాతలకు మాత్రం కేవలం 107 మిలియన్ డాలర్లను మాత్రమే తెచ్చిపెట్టిందట. ఆ కారణం చేత ….. ప్రపంచవ్యాప్తంగా సినిమాహాళ్ళు మూతబడడం వల్ల ఈ జనవరిలోనే విడుదలైన ఈ సినిమాను అమెజాన్ ప్రైంలో చూడడానికి వీలు కల్పించారు.

ఈ క్రింది లింక్ నొక్కి, యూట్యూబ్ లో ఈ సినిమా ట్రైలర్ చూడవచ్చు.

##########################

చింతకుంట్ల సంపత్ రెడ్డి

ఫ్రీమాంట్, కాలిఫోర్నియా, అమెరికా నుండి

04 ఏప్రిల్ 2020

Posted in Uncategorized | Leave a comment

An Apple from Paradise (ఆఫ్గాన్ సినిమా పరిచయం)

An Apple from Paradise (ఆఫ్గాన్ సినిమా పరిచయం)

సినిమా నిడివి: 85 నిమిషాల 15 సెకండ్లు

పరిచయకర్త: సంపత్ రెడ్డి చింతకుంట్ల

15 February, 2017

*********************************************************************

రష్యా దేశంలోని Kazan పట్టణంలో జరిగిన International Muslim Film Festival లో ప్రదర్శించబడ్డ An Apple from Paradise అనే చిత్రం పలువురి ప్రశంసలు అందుకొన్నది. ఆఫ్గనిస్తాన్ ను రష్యా ఆక్రమించుకొన్న రోజులను నేపథ్యంగా తీసుకుని స్క్రిప్ట్, దర్శకత్వం నిర్వహించి Homayun Moravat తీసిన ఈ చిత్రం మూడు (Best film – Didor International Film Festival, Tajikistan, 2009; Best Film – Tolo TV FF, Afghanistan, 2009; Best Feature -Amatyn IFF, 2010) అవార్డులను గెలుచుకొన్నది.

మత మౌడ్యం ఎలా వుంటుందో, అందులోనూ ఛాందసవాదులు ఎలా వుంటారో. మతం, యుద్దాలు మన జీవితాల్లో ఎంతటి విషాదాన్నినింపగలవో సూత్రప్రాయంగా స్పృశించిన ఈ సినిమా ఆఫ్గనిస్తాన్ రాజధాని, కాబూల్ కేంద్ర బిందువుగా కొనసాగుతుంది.

“సినిమాలో చూపించబడ్డ మతం ఇస్లాం. కాని సినిమా టైటిల్ మాత్రం బైబిల్ కి సంబందించింది. హీరోలకేమో యూదుల పేర్లున్నాయి.” అని చెప్తూ యుద్ధం చూపించకుండా యుద్దపలితాలు చూపించడమే తన ఉద్దేశ్యం అని అంటాడు దర్శకుడు. మతాలన్నీ ఒకే సూత్రం మీద నడుస్తాయని అతని అభిప్రాయం కాబోలు. సినిమాలో మహిళా పాత్రలు ఎందుకు లేవు అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ, “అది నా ఆక్షేపణ. ఎందుకంటే, మా సమాజంలో (ఆఫ్గనిస్తాన్ లో) మహిళలు లేరు. పార్లమెంటులో కూడా వాళ్ళ ఉనికి నామమాత్రంగా వుంది.” అంటాడు అతను.

ఇక కథ, యాకుబ్ అనే వృద్దుడు కాబూల్ కి వెళ్ళే ప్రయాణంతో మొదలవుతుంది. సినిమా అంతా చాలావరకు బూడిదరంగు నిండుకొని, ఎక్కడా మరొక రంగు డామినేట్ చేయకుండా, కావాలని ……. విషాదం అలముకొన్నట్టు తీయడంలో దర్శకుడు, చాయచిత్రగ్రాహకులు సఫలమయ్యారు. మొదట్లో వున్న గాంభీర్యత సడలి, దైన్యాన్ని కళ్ళల్లో నింపుకొని, అవరోదాల్లా కనుపించే ఎత్తయిన మట్టిగోడల మధ్య, ఆ చిత్తడి నేలపై, చలిలో గజ గజ వణుకుతూ నడుస్తూ వెళ్ళే ఆ వృద్దున్ని చూస్తే ఎవరికైనా జాలి కలుగక మానదు. కాని, అసలు వైరుధ్యమంతా ఏమిటంటే ఆ వృద్దుడే మత ఛాందసవాదానికి ప్రతీక. ఇద్దరు కొడుకుల్ని సంతోషంగా ఇదివరకే సూసైడ్ బాంబర్లుగా ‘జీహాద్’ కి బలిదానం ఇచ్చినప్పటికీ, చివరి కొడుకును తన వూళ్ళోనే ముల్లా చేయాలని అనుకొన్న యాకుబ్, కాబూల్ లోని మదరసా పర్యవేక్షకుడు చివరి కొడుకును కూడా ‘జీహాద్’ బాట పట్టించాడని తెలిసినప్పుడు మాత్రం క్రుంగిపోతాడు. ఆ కొడుకును ఆ దారినుండి తప్పించడానికి తపిస్తూంటాడు. అనేక ప్రయత్నాలు చేసి, చివరకు తన కొడుకును తీసుకు వెళ్ళిన తీవ్రవాదులను కలుస్తాడు. అప్పటికే తన కొడుకు మరణించిన విషయం తెలియని యాకుబ్ తీవ్రవాదులను బతిమిలాడుతాడు. ఆ ప్రయత్నంలో, తీవ్రవాదులు అతన్ని కూడ కొడుకు దగ్గిరకు పంపివేయమని వాళ్ల అనుయాయులకు ఆదేశాలిస్తారు. అట్లా, తన అస్తిత్వాన్ని కోల్పోయిన ఆ వృద్దుడు ఆపిల్ పండును చూపుతూ కాబూల్ వీదుల్లో పిచ్చివాడుగా తిరుగుతూన్నట్టు చూపించడంతో సినిమా ముగుస్తుంది.

ఆ విధంగా తండ్రి ప్రేమ, మత విశ్వాసం, రెండింటి మధ్య నలిగిపోయిన వృద్దుని పాత్ర పోషించిన Rajab Gussainov నిస్సందేహంగా ఒక విలక్షణమైన నటుడు. సినిమాలోని కీలక అంశాలని గమనించడానికి మనం ముఖ్యంగా ఆ వృద్దుడు టాక్సీ డ్రైవర్ తోనూ, అలాగే పోలీస్ స్టేషన్ లో ఆఫీసర్ తోనూ మాట్లాడే విషయాలని శ్రద్దగా వినాలి. అయితే, త్వరత్వరగా కదిలిపోయే ఇంగ్లీష్ సబ్-టైటిల్స్ ను జాగ్రత్తగా చూడాలి. ఎలాగూ యూ-ట్యూబ్ లోనే చూస్తారు కాబట్టి, పాజ్ చేస్తూ కాని, లేదా మళ్ళీ వెనక్కి వెళ్లి కాని చూడాల్సి రావచ్చు.

ఆ వృద్దుడు ఆపిల్ పండుని తన మూటలో పెట్టుకుని, తనకు ఆకలివేస్తున్నా దాన్ని తినకుండా తన కొడుకును కలిసే ప్రయత్నంలో చివరిదాకా దాన్ని తన మూటలోనే ఉంచుకోవడం, ఆఖరి క్షణాల్లో అది ఆ మూటలోంచి దూరంగా పడిపోవడం అనేది adam and eve లు తిన్న forbidden fruit కి సింబాలిక్ గా చూపుతూ, మతం ఓ మత్తుమందులాంటిది అని సందేశాత్మకంగా చూపిస్తాడు దర్శకుడు. ఈ సినిమా చూసి మత ప్రాతిపదికన జరిగే యుద్దాలు మారణహోమాన్ని తీసుకువచ్చే “యముని మహిషపు లోహఘంటలు” అని అనుకోకుండా వుండలేము.

****************************************************************

యూ-ట్యూబ్ లో లభించే ఈ సినిమా చూడడానికి ఈ లింక్ కొట్టండి: https://www.youtube.com/watch?v=B6__wyFdUBM&list=WL&index=26

Posted in తెలుగు, Movie Review | Leave a comment

సినిమా పరిచయం : The Silence (ఇరానియన్ సినిమా) – 1998

సినిమా పరిచయం : The Silence (ఇరానియన్ సినిమా) – 1998
పరిచయకర్త: సంపత్ రెడ్డి చింతకుంట్ల
దర్శకత్వం: Mohsen Makhmalbaf
రచన తేది: 2 ఫిబ్రవరి, 2017
****
కొన్నిసార్లు మనచుట్టూ కాస్త నిశ్శబ్దం వుంటే బాగుండును అని అనుకొంటాం. కాని అదే నిశ్శబ్దాన్ని ఎక్కువసేపు భరించడం మాత్రం కష్టం. శబ్దం, నిశ్శబ్దం మధ్య మన జీవనపోరాటం కొనసాగుతూంటుంది. ఈ పోరుబాటలోని సంగీతప్రవాహంలో కొట్టుకునిపోయే పదేళ్ళ అంధబాలుడు కోర్శేద్ (Korshed). ఈ బాలుడి జీవితంలోని నాలుగురోజుల కథే The Silence. సంభాషణలు తక్కువగానే వున్నా, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ వున్నాయి.
ఏ వస్తువు “….. కవితకనర్హం…” కాదు అన్నట్లుగా, ప్రతి వస్తువులోనూ సంగీతం తొంగిచూసే ఈ సినిమాలో తలుపు తట్టడం, తుమ్మెద ఝంకారం, నీటి గలగల, వర్షపు చప్పుడు, గుర్రపు పరుగు, శ్రమజీవి ఉచ్వాస నిశ్వాసాలు మొదలైన వాటిల్లో సంగీతాన్ని ఆస్వాదిస్తుంటాడు కోర్శేద్. ఈ గుడ్డి పిల్లవాడి పరవశానికి మనమూ వశమైపోయి…… ఆ శబ్దాల మాధుర్యంలో మనమూ మునకలు వేస్తూ, ఆద్యంతం ఓ సంగీతప్రపంచంలో ఓలలాడుతూ సుమారు 73 నిముషాల ఈ సినిమాని అలవోకగా ఆనందించవచ్చు.


కథాంశం:
కోర్శేద్ తండ్రి …… భార్యను, కోర్శేద్ ను వదలిపెట్టి రష్యాకు వెళ్ళిపోతాడు. ఆ పరిస్థితుల్లో, కోర్శేద్ మన తంబూర లాంటి tambourines అనే సంగీతవాయిద్యాలు తయారుచేసే చోట వాటిని ట్యూన్ చేసే పనిలో కుదురుతాడు. దూరంగా వున్న తమ ఇంటినుండి పట్టణంలో పనికి వెళ్ళడానికి బస్సులో ప్రయాణం చేయాల్సివుంటుంది. అదే యజమాని దగ్గర పనిచేసే అందమైన అమ్మాయి, నాలుగు జడల నదీర (Nadereh) ఇతన్ని బస్సు ఎక్కించడానికి సహాయం చేస్తూంటుంది.
అయితే, కోర్శేద్ కున్న బలహీనత సంగీతం. ఎక్కడ సంగీతం విన్నా, దాన్ని వెతుక్కుంటూ వెళ్లి దారితప్పి తరచుగా పనికి ఆలస్యంగా వెళుతుంటాడు. అందుకని మరే శబ్దాలు వినకుండా చెవుల్లో దూది పెట్టుకుని ప్రయాణం చేయమని నదీర అతనికి సలహా ఇస్తుంది. ఆ సలహా పాటించినప్పటికీ, ఓ జానపద సంగీతకారుని ప్రతిభకు ముగ్దుడై, అతన్ని వెతికేక్రమంలో మళ్ళీ పనికి ఆలస్యంగా వెళతాడు. అది భరించలేని యజమాని కోర్శేద్ ని ఉద్యోగం నుండి తొలగిస్తాడు. మరుసటిరోజు ఇంటి అద్దె చెల్లించకపోతే, ఇల్లు ఖాళీ చేయాల్సి వుంటుందని ఇంటి యజమాని హెచ్చరించటంతో, కోర్శేద్ తన ఆలస్యానికి కారణమైన ఆ జానపద సంగీతకారున్ని వెతికి తీసుకెళ్ళి, తన యజమానికి క్షమాపణ చెప్పే ప్రయత్నం చేస్తాడు. కాని, వాళ్ళు వెళ్ళేసరికే మరేదో కారణాలవల్ల ఆ యజమాని వ్యాపారం మానేసి వెళ్ళిపోతాడు. ఈ లోగా ఇంటి అద్దె గడువు దాటి పోతుంది. తాను కూడా డబ్బులు ఇచ్చి సహాయం చేయలేని పరిస్థితుల్లో, ఆ జానపద సంగీతకారుడు అతని మరో ఇద్దరు మిత్రులు ఇంటి యజమానిని మెప్పించడానికి సంగీతం వినిపిస్తారు. ఆ ప్రయత్నం విఫలమై ఆ యజమాని వీళ్ళ సామాన్లన్నీ బయట పడేస్తాడు. అలా కోర్శేద్ తల్లి తన సామాన్లతో బయల్దేరడం …. కోర్శేద్ ఆ సంగీతకారుల్ని గుర్రపు దౌడు సంగీతం వాయించమని చెప్తూ….. తాను గుర్రంలాగా దౌడు తీస్తూ, తన ఊహాల్లోకి వెళ్ళిపోవడం ….. ఆ ఊహల్లోనే, పట్టణంలోని అంగడి ప్రాంతంలోని ఇత్తడి పరిశ్రమ పనివాళ్ళంతా తన సంగీత దర్శకత్వంలో లయబద్దంగా తమ పనుల్ని చేసుకుంటూ వుండడం మొదలైన అంశాలతో సినిమా ముగుస్తుంది.
***
నాకు నచ్చిన మరి కొన్ని అంశాలు:
1. ఒకసారి కోర్శేద్ బస్సులో వెళ్ళేపుడు ఇద్దరు విద్యార్థులు ఓ పాఠాన్ని బట్టీ పడుతుంటారు. అది విన్న కోర్శేద్ ఆ పాఠాన్ని వెంటనే అప్పజెపుతాడు. అది ఎలా సాధ్యమని అడిగితే, “మీ కళ్ళు మిమ్మల్ని దృష్టి మళ్ళిస్తాయి. కళ్ళు మూసుకుని చదివితే బాగా అర్థమవుతుంది.” అని చెప్తాడు.
2. రెండు జళ్ళ సీత అంటే మనకు ఓ అందమైన చిన్నారి గుర్తుకొస్తుంది. ఇందులో నదీర నాలుగు జడలతో …. ముందు రెండు, వెనక రెండు జడలతో ఉండే చిన్నారి. చాల అందంగా వుండి, గుండ్రటి మొహంతో ఉండే నదీర తన చెవులపై ఇటు రెండు, అటు రెండు చెర్రీ ఫళ్ళు పెట్టుకుని మొహాన్ని అటూ ఇటూ తిప్పుతూ చేసే నృత్యం చూడవలసిందే. ఆ సీన్లో ఫోటోగ్రఫి అత్యద్భుతంగా వుంది. ఇక దర్శకుడి ప్రతిభ సినిమాలోని అడుగడుగునా కనపడుతుంది.


3. సినిమా మొత్తంలో కోర్శేద్ పాత్ర ఎక్కడా ఎలాంటి హావభావాలు చూపించదు. సంగీతం ఒక్కటే అతని ప్రపంచం. ఆనందం, విచారం ….. అన్నిటికీ అతీతం …. అది సంగీత ప్రపంచం. తనదైన ప్రపంచంలో అలా ఒక వ్యక్తి మనగలగడం …. పిల్లలకి, పెద్దలకి గొప్ప స్ఫూర్తి కలిగించే ఒక అద్భుత కావ్యం, The Silence.
ఈ లింక్ కొట్టి మీరూ You Tube లో ఈ సినిమాను చూడవచ్చు: https://www.youtube.com/watch?v=-fZVrBa8iGQ

Posted in Movie Review, Uncategorized | Leave a comment

ఉపన్యాసం_29: ఉడ్రో విల్సన్ 14 సూత్రాలు

ఉపన్యాసం_29: ఉడ్రో విల్సన్ 14 సూత్రాలు

వక్త: ఉడ్రో విల్సన్

==================================

నేపథ్యం:

————

మొదటి ప్రపంచ యుద్దంలో తన దేశాన్ని నడిపించినవాడు…

అమెరికా 28 వ అధ్యక్షుడు … ఉడ్రో విల్సన్!

మరో ప్రపంచ యుద్దాన్ని నివారించడానికి మొదటి మెట్టుగా … జనవరి 8, 1918 రోజున అతను ఈ పద్నాలుగు సూత్రాలను అమెరికన్ కాంగ్రెస్ ముందు ఉంచాడు. తమ దేశాన్ని యుద్ధం వైపుకు నడిపించిన కారణం కూడా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికే అని కూడా విల్సన్ ఉద్గాటించాడు.

అతనికి 1919 లో నోబెల్ శాంతి బహుమానం ఇవ్వబడింది.

●◆●

జెంటిల్ మెన్ ఆఫ్ ద కాంగ్రెస్,

శాంతి ఒప్పందాలు ఆరంభమైనప్పుడు … వాటి ప్రయోజనాల దృష్ట్యా అవి అత్యంత పారదర్శకంగా ఉండి … ఎట్టి రహస్య అవగాహనలు కుదుర్చుకోవడానికి తావు ఇవ్వకుండా ఉంటాయని మనము ఆకాంక్షిస్తున్నాము. దురాక్రమణ, బలసంపదలకు కాలం చెల్లింది; అదేవిధంగా, కొన్ని దేశాలు తమ ప్రయోజనాల కోసమే రహస్య ఒప్పందాలు చేసుకుని ప్రపంచశాంతికి భంగం కలిగేలా హటాత్పరిణామాలు సృష్టించే రోజులకు కూడా కాలం చెల్లింది. గతించిన కాలం గురించి పదే పదే గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండా, ఒక సామాన్యుడికి కూడా ఇది అర్థం అవుతుంది అనేది సంతోషదాయకమైన విషయం. దీనివల్ల … ఇప్పుడు కానీ, మరి ఎప్పుడైనా కానీ … న్యాయం, ప్రపంచ శాంతి గురించి సర్వదా తాపత్రయపడే ప్రతి దేశం ఈ లక్ష్యసాధనకు పూనుకోవడానికి వీలవుతుంది.

మానవ హక్కుల ఉల్లంఘన చర్యల వల్ల మన సొంత ప్రజల కష్టమైపోయినందువల్ల … వాటిని వెంటనే సరి చేయకపోతే మళ్లీ ఇలాంటివి పునరుక్తి అవుతాయని … మనం ఈ యుద్ధంలో పాల్గొనవలసివచ్చింది. అందువల్ల, ఈ యుద్దంలో మనం అడుగుతున్నది ఏదీ ప్రత్యేకంగా మనకోసం కాదు. ప్రజాజీవనం సౌకర్యవంతంగా, సురక్షితంగా ఉండేటట్లుగా ప్రపంచాన్ని తయారు చేయడం … ముఖ్యంగా బలాధిక్యతకు, స్వార్థపూరిత దురాక్రమణకు వ్యతిరేకంగా … ప్రపంచ ప్రజలందరికీ న్యాయం, పారదర్శక లావాదేవీలు నిండి ఉండి … మనదేశంలాగా … వారంతా కూడా తాము కోరుకున్న విధంగా వారి వారి సంస్థా స్థాపనలు చేసుకుంటూ ఉండే విధంగా ప్రతి శాంతికాముక దేశం ఉండగలగాలి. ఇందులో ప్రపంచ ప్రజలందరూ భాగస్వామ్యులే. మిగతా వారికి న్యాయం జరగకుండా, మనకు న్యాయం జరగదు అనే ప్రాతిపదికన ఇందులో మనం భాగస్వామ్యులవుతున్నాము. కాబట్టి, ప్రపంచశాంతి అనే కార్యక్రమం మన కార్యక్రమమే. అది ఒక్కటే సాధ్యం అవుతుంది. మన ఆలోచన ప్రకారం అది ఇలా ఉంటుంది:

I. శాంతి ఒప్పందాలు పారదర్శకంగా ఉండాలి. వాటిని బహిరంగంగా వెల్లడిచేయాలి. ఆ తర్వాత ఎట్టి రహస్య అంతర్జాతీయ ఒడంబడికలు ఉండకూడదు. విదేశాంగ విధానాలను ఖచ్చితంగా బహిరంగంగా నిర్వర్తించాలి.

II. అంతర్జాతీయ ఒప్పందాల అమలు కోసం … యుద్ద సమయంలోనైనా సరే, శాంతి సమయంలోనైనా సరే … అంతర్జాతీయ చర్యలో భాగంగా గాని, మొత్తంగా గాని తప్ప … ప్రాదేశిక జలాల బయట ఉన్న సముద్రాలపై నౌకాయానానికి సంపూర్ణ స్వేచ్ఛ ఉండాలి.

III. శాంతి పరిరక్షణ కోసం అంగీకరించి పాటుపడే అన్ని దేశాలు … వాణిజ్య ఒప్పందాల వ్యవస్థాపనలో సమానత్వం కోసం అన్ని ఆర్థిక అవరోధాలను సాధ్యమైనంతవరకు తొలగించాలి.

IV. అంతరంగిక భద్రతకు అనుగుణంగా అత్యంత గణనీయమైన స్థాయిలో జాతీయ ఆయుధ సంపదను తగ్గించుకునేలా హామీలు ఇచ్చి పుచ్చుకోవాలి.

V. సార్వభౌమాధికారాన్ని నిర్ణయించేందుకు ఉత్పన్నమయ్యే ప్రశ్నలకు … ఆయా వలస ప్రభుత్వాల వాదనతో పాటుగా, సంబంధిత ప్రజల యొక్క ప్రయోజనాలకు సమాన ప్రాధాన్యత కల్పిస్తూ … స్వేచ్ఛాయుతమైన, అరమరికలు లేని నిష్పాక్షికమైన పద్ధతిని ఖచ్చితంగా పాటించాలి.

VI. అన్ని రష్యన్ భూభాగాల తరలింపు, రష్యాను ప్రభావితం చేసే అన్ని ప్రశ్నల పరిష్కారం … ఆమె తన రాజకీయ అభివృద్ధి, జాతీయ విధానాలను నిర్ద్వందంగా ఎంచుకునేందుకు … ఆమెకు ఇతర ప్రపంచదేశాల సంపూర్ణ సహకారం లభిస్తుంది. ఈ స్వేచ్చాదేశాల సమాజంలోకి ఆమెకు సాదర స్వాగతం ఉండగలదని హామీ ఇస్తున్నాం. అంతేగాక, తనకు అవసరమైన, తాను కోరుకుంటున్న అన్ని రకాల సహకారం ఉంటుంది. తమ సొంత ప్రయోజనాలు, తమ నిస్వార్థ సానుభూతితో … ఆమె అవసరాలను గుర్తించి, రానున్న కొద్ది నెలల్లో ఆమె మిత్రదేశాలు రష్యాకు అందించగల ఆదరణ ఒక నికార్సయిన పరీక్షగా నిలిచిపోగలదు.

VII. అన్ని స్వేచ్చాదేశాల వలె తన సార్వభౌమాధికారాన్ని అనుభవించేందుకు వీలుగా … బెల్జియంను ఖాళీ చేసి, పునరుద్ధరించాలనే విషయాన్ని ప్రపంచదేశాలన్నీ అంగీకరిస్తాయి. ఇది తప్ప మరి ఏ ఇతర చర్య కూడా … అన్ని దేశాలు కోరుకుంటున్న పరస్పర సంబంధాలు, చట్టాల అమలులో విశ్వాసాన్ని పునరుద్ధరించలేదు. ఈ స్వస్థత చర్య చేపట్టనట్లయితే అంతర్జాతీయ చట్టం యొక్క నిర్మాణ ప్రామాణికతలు బలహీనపడతాయి.

VIII. మొత్తం ఫ్రెంచ్ భూభాగం విముక్తి చేయబడాలి. ఆక్రమిత ప్రాంతాలన్నీ తిరిగి విలీనం చేయబడాలి. 1871 లో ఆల్సెస్-లోరెన్ విషయంలో ఫ్రాన్స్ పట్ల ప్రష్యా చేసిన తప్పు చర్య గత యాభై సంవత్సరాలుగా ప్రపంచ శాంతికి విఘాతంగా ఉన్నది. అందరి ప్రయోజనాల దృష్ట్యా … శాంతి పరిరక్షణ కోసం ఆ చర్యను సరిదిద్దాలి.

IX. ఇటలీ సరిహద్దుల పునర్వ్యవస్థీకరణ … జాతీయతను స్పష్టంగా గుర్తించగల పద్ధతిలో జరుపబడాలి.

X. ప్రపంచదేశాలలో … ఆస్ట్రియా-హంగరీ ప్రజలకు సుస్థిరమైన, సముచితమైన స్థానం కల్పించబడాలని మనం కోరుకుంటున్నాము. స్వయం సమృద్ధి సాధించడానికి వారికి స్వేచ్చాపూరిత అవకాశాన్ని కల్పించాలి.

XI. రుమేనియా, సెర్బియా, మాంటెనీగ్రో లను ఖాళీ చేయించి, వారి ఆక్రమిత హద్దులను పునరుద్ధరించాలి. సముద్రజలాలపై సెర్బియాకు అవరోధాలు లేని సురక్షిత ప్రవేశాన్ని కల్పించాలి. చారిత్రాత్మక ఆధీనత, జాతీయత అంశాలను పరిగణలోకి తీసుకుని, అన్ని బాల్కన్ దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పడానికి స్నేహపూరితమైన సలహాలు ఇవ్వాలి. అలాగే ఆ దేశాలకు రాజకీయ, ఆర్థిక స్వతంత్ర ప్రతిపత్తిని, ప్రాదేశిక సమగ్రతను కల్పించే విధంగా అంతర్జాతీయంగా హామీలు ఇవ్వాలి.

XII. ఇప్పటి ఆటోమన్ సామ్రాజ్యంలోని టర్కిష్ ప్రాంతాలకు రక్షిత సార్వభౌమాధికారం ఇవ్వడానికి తగిన హామీలు ఇవ్వాలి. కానీ, ప్రస్తుతం పాలనలోని అన్య జాతీయులకు నిస్సందేహంగా జీవిత భద్రత, వారు స్వతంత్రంగా అభివృద్ధి సాధించడానికి అత్యంత భద్రత గల అవకాశాలు కల్పించబడాలి. అంతర్జాతీయ హామీలతో డార్డనెల్లెస్ భూసందిని అన్ని దేశాల నౌకా వాణిజ్య రాకపోకలకు అణువుగా శాశ్వతంగా తెరిచి ఉంచాలి.

XIII. కేవలం పోలిష్ జనాభా మాత్రమే ఉన్న భూభాగాలను చేర్చి, ఒక స్వతంత్ర పోలిష్ దేశం నిర్మించబడాలి. వారికి సముద్ర జలాలలోకి వెళ్లడానికి ఉచితంగా సురక్షితమైన దారి కల్పించాలి. వారి ఆర్థిక స్వాతంత్ర్యం, సరిహద్దుల భద్రత కోసం అంతర్జాతీయ ఒప్పందాల రూపంలో హామీలు ఇవ్వబడాలి.

XIV. పెద్ద దేశాలు, చిన్న దేశాలు అనే తారతమ్యం లేకుండా రాజకీయ స్వాతంత్ర్యం, సరిహద్దుల భద్రత కోసం చేసికొనే ప్రత్యేక పరస్పర హామీలను అమలు చేయడానికి అన్ని దేశాలతో కూడిన ఒక కూటమి ఏర్పాటు చేయబడాలి.

సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా … ఈ తప్పులను ఆవశ్యకంగా సరిదిద్దడానికి మరియు ఇది ఒప్పు అని మనము విశ్వసిస్తున్నాము ఈ విషయాలను పంచుకోవడానికి అన్ని దేశాల ప్రభుత్వాలు, ప్రజలు మాతో భాగస్వాములుగా ఉంటారని మేము భావిస్తున్నాము. ఏ విషయమూ మనల్ని విడదీయలేదు, ఏ ప్రయోజనమూ మనల్ని విభజించలేదు. చివరిదాకా మనం కలిసేవుంటాము.

ఆ విధమైన ఏర్పాట్లు, ఒడంబడికల కోసం మనము పోరాడుతాం. వాటిని సాధించే వరకు మనము పోరాడుతూనే ఉంటాం. కానీ, కేవలం యుద్దాన్ని ప్రేరేపించే కారణాలను తీసివేయడం ద్వారానే మన మనుగడ, నిరంతరం శాంతి వీలవుతుందని మన ఆశ. జర్మన్ గొప్పదనం పట్ల మనకు అసూయ లేదు. దానిని బలహీనపరిచే అంశం కూడా ఈ ప్రకటనలో లేదు. వారి విజయాల పట్ల గానీ లేదా వారి విలక్షణమైన జ్ఞానం పట్ల గాని లేదా ఈర్ష్యను రేకెత్తించేలా ఉన్న వారి సాహస కార్యాలపట్ల మనకు ద్వేషం లేదు. మనము ఆమెను గాయపరచాలని గాని లేదా సహేతుకమైన వారి బలాధిక్యతలను అడ్డగించాలని భావించడం లేదు. మనము ఆయుధాలతో గాని లేదా మనతోపాటుగా ఉన్న ఇతర శాంతి కాముక దేశాల వలె న్యాయబద్ధమైన ఒడంబడికలకు లోబడి … ఆమెకు ప్రతికూలమైన వాణిజ్య ప్రతిపాదనలతో ఆమెతో పోరాటం చేయాలని గాని మనము ఆకాంక్షించడం లేదు. ఆధిపత్యానికి బదులుగా … ప్రపంచ ప్రజలందరిలో ఒకరుగా … మనం నివసిస్తున్న ఈ నూతన ప్రపంచంలో … సమానమైన స్థానాన్ని ఆమె పొందాలని మనము ఆశిస్తున్నాము.

సంస్థాగతమైన మార్పులు గాని, కుదింపులు గాని ఆమె చేసుకోవాలని కూడా సలహాలు ఇవ్వాలని మనము అనుకోవడం లేదు. కానీ, ఒక్క విషయం ఖచ్చితంగా చెప్పాలి. మన పక్షాన ఆమెతో చేయాల్సిన సూక్ష్మమైన ఇట్టి వ్యవహారాలలో ప్రాథమిక ఆవశ్యకత ఏమిటంటే … వారు ఎవరి పక్షాన … అనగా రీక్ స్టాక్ పక్షాననా లేదా మిలిటరీ పార్టీ మరియు సామ్రాజ్యవాద ఆధిపత్యమే వారి మతం అని విశ్వసించే వారి పక్షాననా అనే విషయం మనకు తెలియాలి.

ఎలాంటి అనుమానాలకు, ప్రశ్నలకు తావు ఇవ్వకుండా మనం చాలా ఖచ్చితంగా యదార్థమైన విషయాలను ప్రస్తావించాము. నేను పేర్కొన్న మొత్తం కార్యక్రమం ఒక సుస్పష్టమైన సూత్రం చుట్టూ కూర్చబడింది. అన్ని దేశాలకు … అందులోని ప్రజలందరికీ న్యాయం అనేడే ఆ సూత్రం. వారు బలవంతులైనా, బలహీనులైనా … సాంఘిక సహజీవనంలో … ఇతరులతో పాటు తామూ స్వేచ్ఛగా, సురక్షితంగా బ్రతికేందుకు … సమాన హక్కులు కలిగివుండాలి. ఈ సూత్రం పునాదిగా లేనట్లయితే, అంతర్జాతీయ న్యాయసౌధం యొక్క ఏ భాగం కూడా నిలిచివుండలేదు. అమెరికా సంయుక్త రాష్ట్రాల ప్రజలు ఏ ఇతర సూత్రాన్ని ఆచరించలేరు. ఈ సూత్రాన్ని రుజువు చేయడానికి వారు వారి జీవితాలను, వారి గౌరవాన్ని, వారి సంపదను ధారబోయడానికి సిద్ధంగా ఉన్నారు. మానవాళి స్వేచ్ఛ కోసం జరిగే ఈ చివరి యుద్ధం యొక్క నైతిక చరమాంకానికి ఇక తెర పడనున్నది. అందుకోసం … వారంతా తమ బలాన్ని, తమ ప్రయోజనాన్ని, తమ చిత్తశుద్ధిని, తమ స్వామిభక్తిని పరీక్షకు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు.

●◆●

ముగింపు:

————

ఉడ్రో విల్సన్ ప్రయత్నాలు ఎట్లా ఉన్నప్పటికీ, అమెరికాలోనే అతనికి ప్రతికూల వాతావరణం ఉండడం చేత … ఆ తర్వాతి పరిణామాలలో “వెర్సైల్స్ సంధి” ని అమెరికన్ సెనేట్ ఆమోదించలేదు.

ఆయన ప్రయత్నాలు “లీగ్ ఆఫ్ నేషన్స్” వ్యవస్థాపనకు దారి తీసినాయి, కానీ … ఆ సంస్థ అతను ఆశించినట్లు రెండవ ప్రపంచ యుద్దాన్ని మాత్రం నివారించలేకపోయింది.

ఏది ఏమైనప్పటికీ … ప్రపంచ శాంతిసాధనకు తొలిసారిగా ఒక “బ్లూ ప్రింట్” ను తయారుచేసినవాడుగా ఉడ్రో విల్సన్ నిలిచిపోయాడు. ఈనాటి “ ఐక్యరాజ్యసమితి” కి… అప్పటి “నానాజాతి సమితి (League of Nations)” యే మార్గదర్శిగా నిలిచింది.

ప్రయత్నం విఫలం అయిందనే దానికన్నా … ప్రయత్నం ఆరంభమవడం … విశేషం.

(ఫోటోలు https://www.theworldwar.org/learn/peace/fourteen-points మరియు వికిపీడియా నుండి తీసుకొనబడినవి)

#########################

చింతకుంట్ల సంపత్ రెడ్డి

గురువారం, 30 జూలై 2020

Posted in Uncategorized | Leave a comment

#ఉత్తరం_29: . ఓ నిరక్షరకుక్షి చేసిన అనువాదం

రచయిత: తుషార్ ఎ. గాంధీ

స్వేచ్చానువాదం: చింతకుంట్ల సంపత్ రెడ్డి

మూలం: ఇంగ్లీష్

===================================

నేపథ్యం:

————

గాంధీజీకి నలుగురు కుమారులు …… హరిలాల్ మోహన్ దాస్ గాంధీ, మణిలాల్ మోహన్ దాస్ గాంధీ, రామదాస్ మోహన్ దాస్ గాంధీ, దేవ్ దాస్ మోహన్ దాస్ గాంధీ!

మణిలాల్ మోహన్ దాస్ గాంధీ కుమారుడు, అరుణ్ మణిలాల్ గాంధీ!

అరుణ్ మణిలాల్ గాంధీ కుమారుడు … ఈ ఉత్తర రచయిత, తుషార్ ఏ (అరుణ్) గాంధీ!

తుషార్ అరుణ్ గాంధీ ఆధ్వర్యంలో… దండి ఉప్పు సత్యాగ్రహం 75 వ వార్షికోత్సవం సందర్భంగా మొత్తం 24 రోజుల ఉప్పు సత్యాగ్రహం కార్యక్రమాన్ని అభినయించారు. ఆ విషయాన్ని దేశవిదేశాల్లోని వార్తాపత్రికలు ప్రచురించడంతో చివరిరోజుల్లో అనేకమంది దేశవిదేశీయులు పాల్గొన్నారు. తుషార్ గాంధీ రాసిన Let’s Kill Gandhi అనే పుస్తకం కొంత వివాదంగా మారింది.

మరో సందర్భంలో, ఒక క్రెడిట్ కార్డ్ కంపెనీకి గాంధిజీ ఫోటోను వాడుకోవడానికి ఆయన ఇచ్చిన అనుమతిపై సర్వత్రా వ్యతిరేకత రావడంతో దానిని విరమించుకున్నారు. మే 15 2014 రోజున DNA India అనే పత్రికలో మీడియాను ఉద్దేశిస్తూ తుషార్ అరుణ్ గాంధీ రాసిన ఈ Open Letter కు నాందీప్రస్తావన ఏమీ అక్కర్లేదు … నేరుగా ఉత్తరాన్ని చదివితే చాలు … నేపథ్యం అర్థం అవుతుంది! (బ్రాకెట్లలో ఇచ్చినవి అనువాదకుని వివరణలు –గమనించగలరు.)

●◆●

(ఉత్తరం)

ముఖ్యంగా మీడియా వారికి,

ఈరోజు ఉదయం వార్తాపత్రికల్లో అత్యంత నిందాపూర్వకమైన, బాధాకరమైన కథనం ఒకటి వెలువడింది. బాపు (గాంధీజీ) తన పెద్దకొడుకు హరిలాల్ కు రాసిన ఉత్తరంలో తన సొంత కూతురును మానభంగం చేశాడు అనే నిందారోపణ ఉన్నది. ఈ విషయం … అట్టి ఉత్తరాన్ని వేరే ఉత్తరాలతో పాటుగా మే 22వ తేదీన ఇంగ్లండులోని ముల్లక్ (వేలం వ్యాపార సంస్థ) వారు వేలం వేయబోతున్నారు అనే వార్తలో భాగంగా ప్రచురించబడింది. తండ్రి కొడుకుల అంతరంగిక ఉత్తరప్రత్యుత్తరాలలో భాగంగా, ఆ ఉత్తరం గుజరాతి భాషలో రాయబడింది.

ఉత్తరంలోని కొన్ని భాగాలు ఒక నిరక్షరాస్యుడు అనువదించబడినట్లు … పొంతనలేని ఊహాగానాలతో నిండి ఉన్నాయి. బాపు చేతిరాతతో రాయబడిన ఆ ఉత్తరాల నిజప్రతులను నేను చదివాను. కాబట్టి ఆ ప్రచురణల్లోని వార్త ఎంత తప్పులతడకగా ఉన్నదో, ఎంత దురుద్దేశపూర్వకమైన ఊహాగానాలు అయిఉండవచ్చునో నేను గ్రహించాను. ఆ ఉత్తరంలో హరిలాల్ కాక (‘కాక’ – ఓ గౌరవ సంబోధన) మరియు ఆయన (హరిలాల్) భార్య(చనిపోయింది) సోదరికి మధ్య ఉన్న సంబంధం గురించి బాపు రాశారు. ఆమెను హరిలాల్ కాక పెళ్ళాడాలని అనుకున్నారు. ఆమెకు బాల్యంలోనే వైధవ్యం ప్రాప్తించింది. ఆ పెళ్లికి బాపు కూడా అంగీకరించారు. కానీ నిజాయితీగా అంతకుముందు చేసిన తప్పులను చెప్పవలసిందిగా వారిని అడిగాడు. ఈ సందర్భంగా రాసిన ఉత్తరంలో … అప్పటికే బాపు దగ్గర ఉంటున్న హరిలాల్ కాక కూతురు, మను … ‘ఆమెను’ హరిలాల్ కాక మానభంగం చేశాడని, ఆమెకు వైద్యం అవసరం అని … తనతో చెప్పిందని బాపు వ్రాశాడు. ఇక్కడ ‘ఆమె’ అంటే మరదలు అనే గాని, వార్తాపత్రికల్లో ప్రస్తావించిన సంచలనాత్మకమైన కథనాలలో ఉన్నట్లు ‘మను’ అని కాదు. అదిగాక, తన పెద్ద కొడుకును మద్యం తాగడం కన్నా నీవు చనిపోతే బాగుండును అని కూడా సలహా ఇచ్చినట్లు ఆ వార్తా పత్రికలు వ్యాఖ్యానించాయి. బాపుకు మద్యపానం గిట్టదు అనే విషయంతో పాటు హరిలాల్ కాక మద్యానికి బానిస అయినాడు అనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. హరిలాల్ కాకకు మలేరియా సోకినప్పుడు మద్యం తాగితే ఆ జబ్బు తగ్గుతుందట అని … బాపును … కాక అనుమతి అడిగిన దానికి జవాబుగా … బాపు దిగ్భ్రాంతి చెంది, మలేరియా జబ్బు క్వినైన్ మాత్రలతో తగ్గుతుందని తనకు తెలుసుగాని, మద్యాన్ని ఔషధంగా వాడే విషయం తానెప్పుడు వినలేదని, ఒకవేళ మద్యాన్ని ఔషధంగా వాడవలసి వస్తే అంతకన్నా చావును కౌగిలించుకోవడం మంచిదని చెప్పాడు.

తర్వాత ఈ కాలంలో బా (కస్తూరిబా … గాంధీజీ భార్య) కు జబ్బు చేసినప్పుడు ఆమె నిష్ఠ శాఖాహారి కాబట్టి, పెన్సిలిన్ మందు జంతువుల నుండి వచ్చిన మందు కాబట్టి … ఆమె కాపాడడంకోసం దానిని వాడటానికి బాపు నిరాకరించారు.ఈ కథనాన్ని వార్తాపత్రికలు ప్రచురించిన తీరు గమనిస్తే … అది కేవలం సంచలనం కోరుకుంటూ చేసే ఓ మురికికూపపు జర్నలిజం అని అనుకోవాలి. జర్నలిజం ఒక ఉత్తమమైన వృత్తి. అది గౌరవంగా, నిజాయితీగా, నైతికంగా ఉండితీరాలి. ఇలాంటి తీరు బా, బాపు వంశస్థులుగా, ముఖ్యంగా హరిలాల్ కాక మరియు ఆయన కూతురు మను ఫోయిబా ల ప్రత్యక్ష సంతతికి చెందిన వారుగా మమ్మల్ని కలచివేసింది. ఓ నిరక్షరకుక్షి చేసిన అనువాదం ఆధారంగా చేసిన, పొంతనలేని నిందారోపణలు ప్రచురించడం సిగ్గుపడాల్సిన విషయం. ఈ విషయంలో ప్రెస్ సంయమనం పాటించి, సంచలనాత్మక వార్తలతో పాఠకులను ఆకట్టుకోవడానికి దిగజారకుండా, నిజం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేయాల్సింది. ఎంతో మనస్థాపానికి గురై, నిజం ఏమిటో తెలియజేయడానికి … లేనట్లయితే అబద్ధాలే రాజ్యమేలుతాయనే విషయం చెప్పాలనే ఆకాంక్షతో నేను ఈ ఉత్తరం రాస్తున్నాను. ఇక వేలంపాట చట్టపరమైనదేనా, అంతటి సున్నితమైన అంతరంగిక ఉత్తరాలను డబ్బు అవసరాల నిమిత్తం … చట్టపరంగా హక్కుదారులు అయిన … వాటి యజమానులే అమ్మజూపారా అనే విషయం నిర్ధారించవలసి అవసరం ఉన్నది. ఇది చట్టవ్యతిరేకమైన వ్యాపారం అని కూడా నాకు అనుమానంగా ఉన్నది.

ఈ విషయాలు బహిర్గతం కావాలి. మా పూర్వీకులను, మా కుటుంబాన్ని అప్రదిష్టపాలు చేయడానికి … ద్వేషపూరితమైన ఈ ప్రయత్నాల పట్ల ఏవగింపుతో … ఈ విషపూరితమైన అబద్ధాల ప్రచారాన్ని ఆసక్తితో ఆదరించిన వారంతా … అంతే ఆసక్తిగా నా లేఖ ద్వారా … వాస్తవాలను తెలుసుకుంటారని ఆశిస్తున్నాను.

తుషార్ ఏ. గాంధీ

●◆●ముగింపు:

————-ఈ ఉత్తరం … ఒక అనువాదకుడి బాధ్యత గురించి … ఓ కనువిప్పు.ఉత్తరంలో పేర్కొన్న … ఇంగ్లాండ్ లోని ముల్లక్స్ అనే వేలందారులు … మే 22, 2014 వ తేదీన వేలం కోసం చేసిన ప్రకటన … ప్రకటనగానే ఉండిపోయింది. పై ఉత్తరంతోపాటు మరో రెండు … మొత్తం మూడు ఉత్తరాలు … ఈరోజు వరకు ఎవరూ కొనకుండా అట్లాగే మిగిలిపోయినవి. ఇప్పటికీ వాటిని 50 వేల నుండి 60 వేల పౌండ్ల వరకు అమ్మడానికి వేలందారులు సిద్దంగా ఉన్నారు. వారి వెబ్సైట్ ను నేను స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ జతపరుస్తున్నాను. ఆ సమాచారాన్ని ఈ లింక్ లో కూడా చూడవచ్చు:

https://www.mullocksauctions.co.uk/lot-668278-gandhi…

హరిలాల్ గాంధీ పెద్ద కూతురు పేరు రమిబెన్. ఆమె కూతురు … నీలం పరేఖ్ గాంధీ … Gandhiji’s Lost Jewel: Harilal Gandhi అనే టైటిల్ తో హరిలాల్ గాంధీ జీవితచరిత్రను రాసింది.

అన్నిరకాలుగా గాంధీజీకి … హరిలాల్ గాంధీయే తగిన వారసుడని ఆ పుస్తకంలో ఆమె అభిప్రాయపడిందట. చందూలాల్ బాగుభాయ్ దలాల్ రాసిన హరిలాల్ గాంధీ జీవితచరిత్ర ఆధారంగా నిర్మించిన … ఫిరోజ్ అబ్బాస్ ఖాన్ అనే రంగస్థల దర్శకుని Mahatma vs Gandhi అనే నాటకం విశేష జనాదరణ పొందింది. ఆ నాటకం మరియు హరిలాల్ గాంధీ జీవితంపై దినకర్ జోషి రాసిన నవల ఆధారంగా గాంధీజీ – హరిలాల్ గాంధీలపై తీసిన Gandhi, My Father అనే సినిమా చూసినంత సేపు నీలం పరేఖ్ కళ్ళనీళ్ళ పర్యంతమైనదట.ఇంగ్లీష్, హిందీ, గుజరాతీ భాషలలో … అనిల్ కపూర్ నిర్మించిన Gandhi, My Father సినిమా సుమారు 6 అవార్డులను గెలుచుకున్నది. దర్శన్ జరివాలా గాంధీజీగా, అక్షయ్ ఖన్నా హరిలాల్ గా పాత్ర వహించారు.

Nagasuri Venugopal గారు గాంధీజీ … హరిలాల్ కు రాసిన ఉత్తరం గురించి ప్రస్తావించారు. దాని కోసం వెతుకుతున్న క్రమంలో నాకు ఈ ఉత్తరం కనపడింది. వారికి కృతజ్ఞతలు.

#########################

చింతకుంట్ల సంపత్ రెడ్డి

గురువారం, 23 జూలై 2020

Posted in ఉత్తరాలు, తెలుగు, Uncategorized | Leave a comment

ఉత్తరం -32 … బర్మింగ్ హాం సిటీ జైలు నుండి ఉత్తరం

16 ఏప్రిల్, 1963

మై డియర్ పెద్దమనుషులారా,

ఇక్కడ నేను ఈ బర్మింగ్ హాం సిటీ జైలులో బందీగా ఉన్న సమయంలో నా కార్యకలాపాలు “తెలివి తక్కువవి, సమయానుకూలమైనవి కావు” అని మీరు చేసిన వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చినవి. నా పనిపట్ల చేసే విమర్శలకు నేను చాలా అరుదుగా జవాబు ఇస్తాను. ఒకవేళ నాపై వచ్చే అన్ని విమర్శలకు జవాబు ఇచ్చే పనిలో పడితే రోజంతా నా సెక్రటరీలకు ఆ పని తప్ప వేరే పని చేయడానికి తీరిక చిక్కదు. అలాగే నిర్మాణాత్మకమైన పని చేపట్టడానికి నాకూ సమయం ఉండదు. కానీ, మీరు సదుద్దేశ్యాలు కలిగివున్నవారని, మీ విమర్శలు కూడా నిష్కాపట్యంగా ఉన్నాయని నమ్ముతూ … నేను మీకు సావధానంగా, సహేతుకంగా జవాబు ఇచ్చే ప్రయత్నం చేస్తాను.

 “బయటివారు వస్తున్నారు” అనే భావనతో మీరు ప్రభావితులయ్యారు కాబట్టి నేను ఇక్కడ బర్మింగ్ హాంలో ఎందుకు ఉన్నానో మీకు చెప్పాలి. సదరన్ క్రిస్టియన్ లీడర్షిప్ కాన్ఫరెన్స్ సంస్థకు అధ్యక్షుడిగా ఉండే గౌరవం నాకు దక్కింది. అట్లాంటా, జార్జియా ప్రధానకేంద్రాలుగా ఈ సంస్థ కార్యకలాపాలు అన్ని దక్షిణాది రాష్ట్రాల్లోని కొనసాగుతున్నాయి. దక్షిణాదిన మొత్తంగా మాకు ఎనభై అయిదు అనుబంధ సంస్థలు ఉన్నాయి. అందులో అలబామా క్రిస్టియన్ మూవ్మెంట్ ఫర్ హ్యూమన్ రైట్స్ అనేది ఒకటి. మా అనుబంధ సంస్థలతో  మేము తరచుగా సిబ్బంది, విద్య, ఆర్థికపరమైన లావాదేవీలను పంచుకుంటాము.  కొద్ది నెలల క్రితం ఇక్కడ బర్మింగ్ హాంలోని మా అనుబంధ సంస్థ … అవసరమైతే ఒక అహింసాత్మక కార్యాచరణను ఇక్కడ చేపట్టాలని మమ్మల్ని కోరింది. దానికి మేము ఒప్పుకుని, సమయం రాగానే మా వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాము. అందువల్ల నేను, నా సిబ్బంది చాలామందిమి వారి ఆహ్వానం మేరకు ఇక్కడకు వచ్చాము. నాకు సంస్థాగతమైన సంబంధాలు ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను.

 కానీ,  ప్రాథమికంగా ఎక్కడ అన్యాయం ఉంది కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను. క్రీస్తుపూర్వం ఎనిమిదవ శతాబ్దం లోని ప్రవక్తలు వారి జన్మస్థలాలు వదలి “ప్రభువు ఇలా చెప్పెను” అనే సందేశాలను సుదూర తీరాలకు మోసుకువెళ్ళినట్టుగా, తార్సాస్ (Tarsus) అనే తన ఊరును వదలి జీసస్ క్రైస్ట్ సువార్తలను గ్రీకు రోమన్ ప్రపంచాలకు అందించడానికి ఉపదేశకుడైన పాల్ వెళ్ళినట్టుగా నేనూ నా జన్మస్థలం వెలుపల స్వేచ్ఛా సువార్తలను  తప్పనిసరిగా ప్రచారం చేయవలసివస్తున్నది. మాసిడోనియన్ల  పిలుపుకు పాల్ స్పందించినలుగానే నేనూ అడిగిన వారికి తప్పనిసరిగా సహాయం చేయాలి.

 అంతేగాక, అన్ని సమాజాలు, రాష్ట్రాల మధ్య ఉన్న సంబంధాల పట్ల నాకు అవగాహన ఉన్నది. నేను అట్లాంటా నేను కూర్చునివున్నా బర్మింగ్ హాంలో జరిగేదానిని పట్టించుకోకుండా ఉండలేను. అన్యాయం ఎక్కడ ఉన్నా అది న్యాయానికీ ప్రతిచోటా ప్రతిఘాతమే. మనమంతా పరస్పరత్వము అనే వలలో చిక్కుకుని, తప్పించుకోలేకుండా ఉన్నాము. మనందరి ప్రారబ్ధం ఒకటే.  దేనివల్లనయినా, ప్రత్యక్షంగా ఒకరికి ఏం జరుగుతుందో పరోక్షంగా అందరికీ అదే జరుగుతుంది. ఇకనుండి మరెప్పుడూ “బయటి ఉద్యమకారుడు” అనే కుత్సితపు ప్రాంతీయ భావనతో జీవించివుండే తాహతు మనకు లేదు. అమెరికాలో నివసిస్తున్న ఏ వ్యక్తినయినా సరే ఆ దేశసరిహద్దు లోపల బయటివాడు అనడానికి ఆస్కారం లేదు.

బర్మింగ్ హాంలో జరుగుతున్న ప్రదర్శనలను మీరు గర్హిస్తున్నారు. కానీ, ఈ ప్రదర్శనలకు తావిచ్చిన పరిస్థితుల గురించి మీరు ఏ మాత్రం పట్టించుకోకుండా ఆ విధమైన వ్యాఖ్యలు చేయడం సబబు కాదు అని నేను అంటున్నందుకు మీరు నన్ను క్షమించాలి. కేవలం పరిణామాలే తప్ప అందుకు గల అంతర్గత కారణాలను స్పృశించని, పైపైన చేసే సాంఘిక విశ్లేషణతో మీరెవరు కూడా సంతృప్తి చెందుతారని నేను అనుకోవడం లేదు. బర్మింగ్ హాంలో  ప్రదర్శనలు జరగడం దురదృష్టకరమే అయినప్పటికీ ఈ పట్టణపు శ్వేత అధికార వ్యవస్థ నీగ్రో సమాజానికి మరో గత్యంతరం లేకుండా చేసింది.

 అహింసాత్మక ఉద్యమాలు ఏవైనా సరే అవి ప్రాథమికంగా నాలుగు చర్యల కార్యాచరణ కలిగివుంటాయి: 1. అన్యాయం జరుగుతున్నదా అనే నిజనిర్ధారణ 2. సంప్రదింపులు 3. అంతఃకరణ శుద్ధి 4. ప్రత్యక్ష కార్యాచరణ. మేము బర్మింగ్ హాంలో ఈ నాలుగింటిని పాటించాము. జాతి వివక్షత ఈ సమాజాన్ని ఆవరించివున్నదనే సత్యాన్ని ఎవరూ త్రోసిపుచ్చలేరు. అమెరికా మొత్తంలోనే బర్మింగ్ హాం లాంటి వేర్పాటు పట్టణం బహుశా మరొకటి లేదు. ఇక్కడ జరిగిన పోలీసుల క్రూర చర్యల భాగోతం ఈ దేశంలోని అన్ని వర్గాల వారికి తెలుసు. కోర్టులలో నీగ్రోల పట్ల చేసిన అన్యాయమైన విచారణలు బహిరంగ సత్యాలే. నీగ్రోల ఇళ్లపైన, చర్చిల పైన జరిగిన బాంబుదాడుల కేసులు బర్మింగ్ హాంలో ఉన్నంత అపరిష్కృతంగా ఈ దేశపు మరే ఇతర పట్టణంలోనూ లేవు. ఇవి కఠోరమైన, క్రూరమైన, నమ్మలేని నిజాలు. ఈ విషయంలో నీగ్రో నాయకులు … పట్టణ ప్రముఖ శ్వేతజాతి నాయకులతో సంప్రదింపులు జరపడానికి కోరారు. కానీ ఆ రాజకీయ నాయకులు అందుకు ఏనాడూ తావివ్వలేదు.

 ఆ తర్వాత గత సెప్టెంబరులో ఆర్ధిక సమాజపు నాయకులతో మాట్లాడే అవకాశం వచ్చింది. ఆ సంప్రదింపులలో నల్లజాతివారిని అవమానపరిచే విధంగా ఉన్న సైన్ బోర్డుల లాంటివి తీసివేస్తామని వ్యాపారస్తులు చెప్పారు. అలాంటి మరికొన్ని హామీలను కూడా ఇచ్చారు. ఆ హామీల మేరకు రెవరెండ్ ఫ్రెడ్ షటిల్ వర్త్,  అలబామా క్రిస్టియన్ మూవ్మెంట్ ఫర్ హ్యూమన్ రైట్స్ ప్రదర్శనలను నిలిపివేస్తామని ఒప్పుకున్నారు. వారాలు, నెలలు గడిచిన తర్వాత మేము మోసగించబడ్డాము అని అర్థమైంది. ఆ సైన్ బోర్డులు అలాగే ఉన్నాయి. గతంలోని ఎన్నో అనుభవాలలాగే మా ఆశలు చిధ్రమైనవి. తీవ్రమైన నిరాశల నీడలు మమ్మల్ని అలుముకున్నాయి. అందువల్ల మాకు ప్రత్యక్ష కార్యాచరణ తప్ప మరో మార్గం లేకపోయింది. మా దేహాల ద్వారా మా వ్యాజ్యాన్ని అన్ని ప్రాంతీయ, దేశీయ సమాజాలకు సమర్పించాము. దానివల్ల వచ్చే కష్టనష్టాలు మాకు తెలియకపోలేదు. అందువల్ల మేము మా అంతఃకరణలను శుద్ధి చేసికొనే  కార్యక్రమాన్ని చేపట్టేందుకు నిశ్చయించుకున్నాము. మేము అహింస పైన వర్క్ షాపులు నిర్వహించాము. ప్రతిఘటనకు పాల్పడకుండా మీకు తగిలే దెబ్బలను మీరు ఓర్చుకోగలరా?” … “జైలుశిక్షలో ఉండే కష్టాలను భరించగలరా?” అనే ప్రశ్నలను మేము పదేపదే వేసుకున్నాము. క్రిస్మస్ ను మినహాయిస్తూ, మిగతా రోజుల్లో షాపింగ్ ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో మేము ఈస్టర్ పండుగ రోజులను మా ప్రత్యక్ష కార్యాచరణకు ఎన్నుకున్నాము. ఆ కార్యాచరణవలన దృఢమైన ఆర్థిక విరమణ కార్యక్రమం రూపొందగలదని, ఈ సమయంలో అయితేనే వ్యాపారస్తులపై ఒత్తిడి తీసుకురావచ్చని మేము భావించాము. ఆ తర్వాత, మార్చిలో ఎన్నికలు వస్తున్నాయని గ్రహించి, అప్పటికప్పుడు మా కార్యాచరణను ఎన్నికల రోజుకు వాయిదా వేశాము. ఇక మిస్టర్ కానర్ ఓడిపోయే పరిస్థితిలో ఉన్నాడని తెలుసుకుని, మరల ఒకసారి మా కార్యాచరణను వాయిదావేశాము. ఎందుకంటే, ప్రదర్శనల మూలంగా సమస్యలు మరుగున పడకూడదు అని మేము అనుకున్నాము. ఈసారి మా అహింసాత్మక ప్రదర్శన ఆయన ఓటమి తరువాతి రోజున ఆరంబించాలని నిశ్చయించాము.

 మేము మా ప్రత్యక్ష కార్యాచరణను బాధ్యతారహితంగా చేపట్టలేదనే వాస్తవాన్ని పై విషయాలను తెలియజేస్తాయి. మేము కూడా మిస్టర్ కానర్ ఓటమిని చూడాలనుకున్నాము కాబట్టి, సామాజిక అవసరానికి తగిన విధంగా మేము వాయిదా తర్వాత వాయిదా వేస్తూ వచ్చాము.

“ప్రత్యక్ష కార్యాచరణ ఎందుకు? బైఠాయింపులు ఎందుకు? పాదయాత్ర ప్రదర్శనలు ఎందుకు? సంప్రదింపుల మార్గం మంచిది కదా?” … ఇలా ఎన్నో ప్రశ్నలు మీరు అడగవచ్చు. మీరన్నట్టు సంప్రదింపుల మార్గం సరయినదే. నిజానికి ప్రత్యక్ష కార్యాచరణ ఉద్దేశ్యం అదే. సంప్రదింపులను నిరాకరించిన సమాజానికి సంక్షోభాలు సృష్టించి, ఒత్తిడిని నెలకొల్పి … వారి సమస్యలను ఎదుర్కొనేలా చేయడమే అహింసాత్మక కార్యాచరణ యొక్క ప్రధాన ఉద్దేశ్యం అదే. సమస్యను నాటకీయంగా ప్రదర్శిస్తేనే దానిని పట్టించుకోకుండా ఉండలేని పరిస్థితి వస్తుంది. ఆటంకాలు కల్పించి ఒత్తిడి సృష్టించడం అహింసాత్మక కార్యాచరణలో ఓ భాగం అని ఇదివరకే ప్రస్తావించాను. ఇది మీకు కొంత ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ, “ఒత్తిడి” అనే పదం నాకు భయాన్ని కలుగజేయదని నేను తప్పక ఒప్పుకోవాలి. హింసాత్మక ఒత్తిడికి వ్యతిరేకంగా నేను మనఃపూర్వకంగా పని చేశాను, భోదించాను. కానీ, అభివృద్ధి కోసం అవసరమైన నిర్మాణాత్మకమైన అహింసాత్మక ఒత్తిడి అనేది కూడా వేరుగా ఉన్నది. కల్పనలు, అపోహల బంధనాల నుండి విముక్తి పొందేలా వ్యక్తుల మెదళ్ళలో ఒత్తిడి సృష్టించడం అవసరం అని సోక్రటీస్ అభిప్రాయపడ్డాడు. అలా చేసిన పక్షంలో వారు అవధులులేని సృజనాత్మక విశ్లేషణ చేస్తూ వాస్తవిక దృక్పథం పెంపొందించుకుంటారు. మానవులు దురభిమానము, జాతివివక్ష వదలి … అవగాహన, సౌభ్రాతృత్వాన్ని అలవరచుకునే అద్భుతశిఖరాలను అధిరోహించగలిగేందుకు  అహింసాత్మకంగా ఉండే చెవిలో జోరీగలు అవసరం. అందువల్ల, తప్పనిసరి పరిస్థితుల్లో సంప్రదింపులకు దారులు తెరుచుకునేలా ఉండే సంక్షోభ పరిస్థితులను  సృష్టించడమే ప్రత్యక్ష కార్యాచరణ లక్ష్యం. కాబట్టి మీ సంప్రదింపుల పిలుపు మాకు సమ్మతమే. ఈ విచారకరమైన ప్రయత్నంలో మా ప్రియతమ దక్షిణాది ప్రాంతం సంభాషణకు స్వగతం అనే బురదలోనే చాలాకాలంగా కూరుకుపోయింది.

 మా చర్యలు కాలానుగుణంగా లేవు అనేది మీ ఆరోపణలలో ముఖ్యమైనది. “నూతన ప్రభుత్వ యంత్రాంగానికి కొంత సమయం మీరు ఎందుకు ఇవ్వలేదు?” అని కొందరు అడిగారు. దానికి నా సమాధానం … పాత యంత్రాంగం పట్ల ప్రవర్తించినట్టుగానే … అది ఏ విధమైన చర్యలు చేపట్టకముందే కొత్త యంత్రాంగాన్ని కూడా ముళ్ళుకర్రతో పొడవాలి. మిస్టర్  బోట్ వెల్ ఎన్నిక బర్మింగ్ హాంకు వేయి సంవత్సరాల న్యాయము, శాంతి, సంతోషాలను తీసుకువస్తుందని మేము అనుకునేటట్లయితే మేము చాలా పొరపాటు చేస్తున్నామని భావించవలసి వస్తుంది. మిస్టర్ కానర్ కన్నా మిస్టర్  బోట్ వెల్ చాలా ఎక్కువ వాక్పటిమ కలవాడు, నెమ్మదస్తుడు అయినప్పటికీ వారిద్దరూ వేర్పాటువాదులే. ఇతను కూడా ఇదివరకు నెలకొనివున్న పరిస్థితిని కొనసాగించాలనే ఉద్దేశ్యంతో ఉన్నవాడే. మిస్టర్  బోట్ వెల్ విషయంలో నాకు ఆశావహంగా ఉన్న విషయమేమిటంటే –వేర్పాటువాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న భారీ ప్రతిఘటన నిరర్థకం అని అతను అభిప్రాయపడుతున్నాడు. కానీ, మానవహక్కుల అభిమానుల నుండి ఒత్తిడి లేకపోతే దీనిని అతను చూడలేడు. ప్రియ స్నేహితులారా, న్యాయపరమైన, అహింసాత్మకమైన ఏ విధమైన ఒత్తిడి అవసరమో తెలుసుకోకుండానే మానవహక్కుల విషయంలో చిన్న చిన్న విజయాలు మేము సాధించలేదు అనే విషయాన్ని నేను మీకు చెప్పాలి. డబ్బు, పలుకుబడి, హోదా ఉన్న వారు వాటిని వదులుకోవడానికి తామంతట తాము ముందుకురారు అనేది ఇన్నాళ్లుగా చర్వితచర్వణంగా చరిత్ర చెబుతున్న కఠోర సత్యం. విడివిడిగా  ఉన్నప్పుడు వ్యక్తులు నీతిబాహ్యమైన పనులు చేయకుండా నైతికధర్మానికి కట్టుబడివుండవచ్చేమో గాని … Reinhold Niebuhr చెప్పినట్టుగా వ్యక్తులకన్నా సమూహాలు నీతిబాహ్యమైనవి.

 పీడితులు పట్టుబట్టి అడిగే అంతవరకు … పీడకులు స్వచ్ఛందంగా స్వేచ్ఛను ప్రసాదించరనేది బాధాకరమైన అనుభవం. నిజానికి, వేర్పాటువాదం వ్యాధితో బాధపడని ప్రతివారు వాడే “సమయానుకూలత” ను ప్రత్యక్ష కార్యాచరణ ఉద్యమంలో నేను ఏనాడు పాటించలేదు. “ఆగండి” అనే మాటను సంవత్సరాలుగా నేను వింటున్నాను. ఈ మాట ప్రతి నీగ్రో చెవిలోనూ గింగిర్లు కొడుతున్నది. “ఆగండి”  అనేదాని అర్థం “ఎన్నడూ లేదు” అనే కదా. అది ప్రసవసమయంలో ఉన్న బాధ అప్పటికప్పుడు తెలియకుండా వాడే తలిడోమైడ్ లాంటి మత్తుమందు. కానీ, దానివల్ల నిరాశానిస్పృహలు మాత్రమే పుడుతున్నాయి. గతంలో న్యాయాధీశులు చెప్పినట్టుగా “న్యాయం ఆలస్యమైతే న్యాయం నిరాకరించబడినట్లే” అనే సత్యాన్ని మేమంతా చవిచూస్తున్నాము. భగవంతుడు ప్రసాదించిన హక్కుల కోసం, రాజ్యాంగ హక్కుల కోసం మేము మూడు వందల నలభై ఐదు సంవత్సరాలు వేచివున్నాము. ఆసియా, ఆఫ్రికా ఖండాలలోని దేశాలు రాజకీయ స్వాతంత్ర్య లక్ష్యం చేరుకోవడానికి అత్యంత వేగంగా ముందుకు దూసుకువెళుతున్నాయి. మనం మాత్రం మధ్యాహ్న వేళల్లో ఓ కప్పుడు కాఫీ కోసం వెళ్ళే ఒంటెద్దు బండి వేగంతో నెమ్మదిగా కదులుతున్నాము. “ఆగండి” అనే వేర్పాటువాదపు పలుకు ములుగు లాగా ఏవిధంగా గుచ్చుకుంటుందో తెలియనివారికి దానిని ఉచ్ఛరించడం తేలికైన పనే. కానీ, మీ అమ్మలను, నాన్నలను ఇష్టానుసారం చిత్రవధలకు గురి చేస్తే, మీ సోదరిసోదరులను ఉన్మాదంగా వేధిస్తుంటే చూసి; మీ నల్లజాతి సోదరిసోదరులను తిట్టి, కొట్టి, హింసించి … చివరకు చంపేస్తుంటే కూడా చూసి; ఓ సంపన్న సమాజం మధ్యలో పేదరికం అనే గాలిచొరబడలేని బోనులో మీ ఇరవై మిలియన్ల మంది నీగ్రో సోదరులలో చాలామందిని ఊపిరిసలపకుండా గొంతునులిమి చంపేస్తుంటే చూసి; అప్పుడే టీవీలో వచ్చిన ప్రకటన చూసి పబ్లిక్ అమ్యూజ్మెంట్ పార్కుకు వెళ్ళేందుకు ఎందుకు వీలులేదు అని మీ ఆరేళ్ళ కూతురుకు వివరించడానికి మీ నాలుక తత్తరపడుతుంటే  గమనించి; నల్లజాతి పిల్లలకు ఫన్ టౌన్ లో అనుమతి చెప్పిన ఆమె చిన్న కళ్ళలో నీళ్ళు చిప్పిలుతూంటే చూసి; నిమ్నాతాభావాలు ఆమె మదిలో నిరాశా మేఘాలు సృష్టిస్తూంటే చూసి; అచేతనావస్తలోనే శ్వేతజాతీయుల పట్ల ఆమె పసిప్రాయపు వ్యక్తిత్వంలో  విరోధభావం చోటుచేసుకోవడాన్ని చూసి; ఎంతో బాధతో “నాన్నా, తెల్లవారు మన పట్ల ఇంత నీచంగా ఎందుకు ప్రవర్తిస్తారు?” అనే మీ అయిదేళ్ళ అబ్బాయి అడిగే ప్రశ్నలకు జవాబుగా  కట్టుకథలు సృష్టించడానికి ఇబ్బంది పడుతూ; రహదారులపై అలసి పోయి ఓ రాత్రి సేదతీరడానికి మోటేల్స్ లో అనుమతి లేక వాహనాల్లోనే అసౌకర్యంగా పడుకోవాల్సిరావడం; “నల్లవారు, తెల్లవారు” అనే  సైన్ బోర్డ్స్ ప్రతిరోజూ మీమ్మల్ని వెక్కిరిస్తూ ఉంటే; మీ పేరు “నల్లోడు (nigger), మీ ఇంటి పేరు “జాన్” మీకు ఎంత వయసు ఉన్నా “పిల్లోడా (boy)” అని పిలుస్తూంటే; మీ భార్యలకు, తల్లులకు “శ్రీమతి” అనే గౌరవవాచకాలు ఇవ్వకపోతే; పొద్దంతా ఒళ్ళు హూనం అయ్యేలా పనిచేసి, రాత్రిళ్లు నువ్వు నీగ్రోవు అనే నిజం నిన్ను దెయ్యంలా వెంబడిస్తూంటే … తెలియని భయాలు లోలోపల పీడిస్తూంటే;  ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ఉక్రోషం ముంచుకొస్తూంటే; నిరంతరం నీ “ఉనికి” ని కోల్పోతున్న భావనతో నీవు పోరాటం చేయవలసి వస్తే … అప్పుడు … వేచివుండడం ఎంత కష్టమో మీకు  తెలిసివస్తుంది. సహనం అనే పాత్ర నిండిపోయి, వారి ఆశలు అడియాసలు అయినప్పుడు … మరెంతకాలమూ అన్యాయపు అగాథాల్లోకి కూరుకుపోవడానికి ఎవరూ ఇష్టపడరు. న్యాయమైన, అనివార్యమైన మా అసహనాన్ని మీరు అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను.

మేము శాసనోల్లంఘన పట్ల మొగ్గు చూపిస్తున్న విషయంలో మీరు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది సహేతుకమైనదే. ప్రభుత్వ పాఠశాలల్లో నల్లజాతి పిల్లలను వేరుగా కూర్చోబెట్టే పద్ధతి చట్ట వ్యతిరేకమని 1954 లో సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాలను జాగ్రత్తగా అనుసరించమని మేము ప్రజలను అభ్యర్థిస్తున్నాము. కాబట్టి మేము శాసనాన్ని ఉల్లంఘిస్తున్నామని అనడం వింతగా ఉంది. “కొన్ని చట్టాలను ఒప్పుకుని, మరి కొన్ని చట్టాలను ఎలా ఉల్లంఘిస్తారు” అని మీరు అడగవచ్చు. దానికి సమాధానం: చట్టాలు రెండు రకాలుగా ఉంటాయి –న్యాయమైనవి, అన్యాయమైనవి. సెయింట్ ఆగస్టీన్ చేసిన “అన్యాయమైన చట్టం అసలు చట్టమే కాదు.” అనే వ్యాఖ్యానంతో నేను ఏకీభవిస్తాను.

మరి ఈ రెండింటిలో తేడా ఏమిటి? ఒక చట్టం న్యాయమైనది లేదా అన్యాయమైనది అని మీరు ఎలా గుర్తిస్తారు? మనుషులు చేసిన చట్టాలు … నైతిక విలువలు లేదా ప్రభువు ప్రభోదించిన విలువలను కలిగివుంటే అవి న్యాయసమ్మతమైనవి. నైతిక విలువలతో సామరస్యం లేనివి అన్యాయమైనవి. సెయింట్ థామస్ అక్వినాస్ చెప్పినట్లుగా విశ్వజనీనమైన ధర్మాన్ని, ప్రాకృతిక ధర్మాన్ని పాటించకుండా మానవుడు చేసిన ఏ చట్టమైనా అన్యాయమైనదే. మానవ వ్యక్తిత్వాన్ని కించపరచే ఏ చట్టమైనా అన్యాయమైనదే. మానవ వ్యక్తిత్వాన్ని ఉద్ధరించే ఏ చట్టము ఏదైనా న్యాయమైనదే. వేర్పాటువాద నియమాలు అన్నీ అన్యాయమైనవే. ఎందుకంటే, వేర్పాటు అనేది ఆత్మక్షోభ కలిగించడమే గాక వ్యక్తిత్వ వినాశనానికి కారణమవుతుంది. అది వేర్పాటువాదులకు ఒక తప్పుడు ఆధిక్యతా భావాన్ని, వేర్పాటుకు గురైనవారికి ఒక తప్పుడు న్యూనతాభావాన్ని కలుగజేస్తుంది. వేర్పాటువాదం “నేను-నీవు” అనే సంబంధాలకు బదులుగా “నేను-అది” అనే పద్ధతికి మారిపోయి, వ్యక్తులను వస్తువులుగా పరిగణించే ధోరణికి దిగజారుతుందని యూదు తత్వవేత్త మార్కిన్ బూబర్ అభిప్రాయం. కాబట్టి, వేర్పాటువాదం కేవలం రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికపరంగా లోపభూయిష్టమైనదే కాకుండా నైతికంగా కూడా తప్పిదమైనది, పాపిష్టిది. వేరుగా చూడటం అనేది పాపం అని పాల్ తిలిచ్ అంటాడు. వేర్పాటు అనేది మానవుని విషాదభరితమైన ఎడబాటు యొక్క అస్తిత్వవాద భావప్రకటన కాదా? ఒక భయంకరమైన మనస్థాపపు భావము, అతని యొక్క తీవ్రమైన పాపిష్టితనము కాదా? అందువల్ల, 1954 లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పాటించమని నేను అడగగలను. ఎందుకంటే, నైతికంగా అది సరియైనది. నైతికంగా అది తప్పు కాబట్టి, వేర్పాటుకు సంబంధించిన శాసనాలను ఉల్లంఘించమని నేను అడగగలను.

మనమిప్పుడు మరింత వాస్తవమైనవి … న్యాయమైనవి కొన్ని, అన్యాయమైనవి కొన్ని ఉదాహరణలు పరిశీలిద్దాం. అవసరంలేకపోయినా … అధికసంఖ్యాకులు, అల్పసంఖ్యాకులపైన రుద్దే నియమాలు అన్యాయమైన శాసనాలు. ఇది వ్యత్యాసాన్ని చట్టపరం చేయడం. మరొకవైపు అధికసంఖ్యాకులు … తాము అనుసరించదలచుకున్న దానిని అల్పసంఖ్యాకులను కూడా ఆచరించమని చెప్పడం. ఇది సాదృశ్యం అయిన దానిని చట్టపరం చేయడం.

ఇంకొక వివరణ ఇస్తాను. చట్టాన్ని తయారుచేసే సమయంలో అల్పసంఖ్యాకులు ఏ విధమైన పాత్ర వహించకుండా చేసిన చట్టం అన్యాయమైనది. ఎందుకంటే, వారికి ఆ విషయంలో ఓటు చేసే హక్కు కూడా ఇవ్వబడలేదు. వేర్పాటు చట్టాలను చేసిన అలబామా శాసనమండలి ప్రజాస్వామికంగా ఎన్నుకొనబడినదని ఎవరు అనగలరు? అలబామా రాష్ట్ర వ్యాప్తంగా నీగ్రోలను ఓటర్లుగా నమోదుచేసుకోకుండా నిరోధించడానికి అన్నిరకాల కుట్రపూరితమైన పద్ధతులను అమలుచేశారు. అధిక సంఖ్యలో నీగ్రో జనాభా ఉన్న కొన్ని కౌంటీలలో ఒక్క నీగ్రో కూడా ఓటరుగా నమోదు కాకుండా చూశారు. ఆ విధమైన రాష్ట్రంలో చేసిన ఏ చట్టాన్నయినా అది ప్రజాస్వామికంగా రూపొందించబడినదని చెప్పగలరా?

న్యాయమైన, అన్యాయమైన చట్టాల గురించి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. రూపం రీత్యా న్యాయమైన చట్టాన్ని అన్యాయంగా అమలుపరచిన దృష్ట్యాంతాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు, అనుమతిలేకుండా ప్రదర్శన చేస్తున్నందుకు శుక్రవారం రోజు నన్ను అరెస్టు చేశారు. ఇప్పుడు, ప్రదర్శన కోసం అనుమతి అవసరం అనే శాసనం ఎంతమాత్రమూ తప్పు కాదు. రాజ్యాంగ మొదటి సవరణ ప్రకారం … శాంతియుతంగా సమావేశాలు గానీ, నిరసనలు గానీ నిర్వహించవచ్చు. కానీ, ఈ హక్కులు పౌరులు వినియోగించుకోకుండా వేర్పాటు వైఖరితో చేసే ఏ శాసనమైనా అన్యాయమైనదే.

ఈ విధమైన శాసనోల్లంఘన కొత్తదేమీ కాదు. నేబూకానెజర్ చేసిన శాసనాలను షడ్రక్, మిసాక్, అబెడ్నేగో (బుక్ ఆఫ్ డేనియల్ అనే పుస్తకంలోని ఘట్టం) ఉల్లంఘించిన విషయం నైతికంగా న్యాయమైనది కాబట్టి శ్లాఘించబడింది. దానిని ఆది క్రైస్తవులు అద్భుతంగా ఆచరించారు. వారంతా రోమన్ సామ్రాజ్య అన్యాయపు శాసనాలకు తలొగ్గే ముందు ఆకలిగొన్న సింహాలను, కండలను చీలుస్తూ తమ తలలు నరకబడిన బాధలను ఎదుర్కొన్నారు. ఆరోజున సోక్రటీసు శాసనోల్లంఘనం ఆచరించాడు కాబట్టి ఈరోజు కొంతవరకు విద్యనార్జించే స్వేచ్ఛ నిజమైంది.

జర్మనీలో హిట్లర్ చేసిన ప్రతి పని “చట్టపరమైనదే” అనే విషయం మనము ఏనాటికీ మరిచిపోలేం. అలాగే, హంగరీలో స్వాతంత్ర సమరయోధులు చేసిన ప్రతిదీ “చట్ట వ్యతిరేకమైనదే.” హిట్లర్ పరిపాలనలోని జర్మనీలో యూదులకు సహాయం చేయడం, వారిని అనునయించడం “చట్ట వ్యతిరేకమైనది.” ఒకవేళ ఆ సమయంలో నేను జర్మనీలో నివసిస్తున్నట్లయితే అది చట్టవ్యతిరేకమైనప్పటికీ నా యూదు సోదరులను అనునయిస్తూ, వారికి సహాయం అందిస్తూ ఉండేవాడిని. ఒకవేళ ఈరోజున నేను క్రైస్తవమత విశ్వాసాలను అణగదొక్కుతున్నకమ్యూనిస్టు దేశంలో నివసిస్తున్నట్లయితే మత వ్యతిరేక చట్టాలను ఉల్లంఘించేందుకు బహిరంగంగా ప్రచారం చేసేవాడిని.

నా క్రైస్తవ, యూదు సోదరులైన మిమ్మల్ని నిజాయితీగా రెండు క్షమాభిక్షలు (confessions) అర్థిస్తాను. మొదటిది, గత కొన్ని సంవత్సరాలుగా శ్వేతజాతి మితవాదులతో నేను చాలా అసంతృప్తి చెందానని ఒప్పుకుంటున్నాను. స్వేచ్ఛ కోసం పరితపించే నీగ్రోలకు అతిపెద్ద అవరోధం వైట్ సిటిజెన్స్ కౌన్సిలర్స్ గానీ, కు క్లక్స్ క్లాన్ సభ్యులు కానీ కాదు. వారంతా న్యాయం కన్నా వ్యవస్థకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే శ్వేతజాతి మితవాదులే. వారు న్యాయము ఉండే అనుకూల శాంతి కన్నా, ఉద్రిక్తత లేని ప్రతికూల శాంతిని కోరుకుంటారు. “నీ గమ్య సాధనకు నీవు చేస్తున్న పని మాకు సమ్మతమే కానీ, నీ ప్రత్యక్ష కార్యాచరణ పద్ధతులను మేము అంగీకరించలేము” అని వారు అంటారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని నియంత్రించినట్లు ఇతరుల స్వేచ్ఛను నియంత్రించే కార్యనిర్వహణ క్రమపట్టిక (Time-Table) తయారు చేయగలమని వారు అనుకుంటారు. సమయం అనే కల్పనను అనుసరిస్తూ … నీగ్రోలను “మరింత మంచి సమయం కోసం వేచివుండండి.” అని వారు చెబుతారు. చెడ్డవారి సంపూర్ణ అపార్థం కన్నా మంచివారి అసంపూర్ణ అవగాహన విసుగు పుట్టిస్తుంది. భేషజం లేకుండా నిరాకరించడం కన్నా అర్థంగీకారం చికాకుపరుస్తుంది.

మా చర్యలు శాంతియుతమైనవే అయినప్పటికీ అవి హింసకు దారితీస్తాయి అని మీరు మీ వాంగ్మూలంలో పేర్కొన్నారు. కానీ మీ వ్యాఖ్యలను తార్కికంగా చెప్పవచ్చునా? ఇది … నీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి అది మరొక వ్యక్తిని ఆ డబ్బు తస్కరించడానికి ప్రేరేపించింది అని ఖండించడం లాంటిది కాదా? ఇది … సోక్రటీస్ యొక్క అచంచల సత్యనిరతి, అతని తాత్విక చింతన … ఆయన విషం పుచ్చుకోవడానికి పథబ్రష్టున్నిచేసిందని ఖండించడం లాంటిది కాదా? ఇది … క్రీస్తు తన అద్వితీయ ప్రభువు గురించిన చైతన్యం, తన అంతులేని ప్రభు భక్తి … అతనిని శిలువ వేసేందుకు దారితీసిందని ఖండించడం లాంటిది కాదా? ఫెడరల్ న్యాయస్థానాలు ఏకరీతిన దృఢపరచినట్లుగా … ఒక వ్యక్తిని అతని ప్రాథమిక రాజ్యాంగహక్కుల సాధన … హింసను ప్రేరేపిస్తుంది కాబట్టి ఆ అన్వేషణను విరమించుకోవాలని చెప్పడం లాగ ఉంటుందనే విషయాన్ని ఇప్పుడు మనం గ్రహించాలి. సమాజం దోపిడీదారును శిక్షించి, దోపిడికి గురైన వారిని రక్షించాలి.

సమయం అనే కల్పిత భావనను శ్వేతజాతి మితవాదులు నిరాకరిస్తారని నేను ఆశించాను. టెక్సాస్ నుండి శ్వేతజాతి సోదరుడు ఒకరు రాసిన ఉత్తరం ఒకటి ఈరోజే నాకు చేరింది. “నల్లజాతివారికి సమాన హక్కులు నెమ్మదిగా సంక్రమిస్తాయని క్రైస్తవులు అందరూ తెలుసుకోవాలి. అంత మతపరమైన తొందర ఉంటే అది సాధ్యమవుతుందా? ఇప్పుడున్న స్థాయికి చేరుకోవడానికి క్రైస్తవమతానికి రెండువేల సంవత్సరాలు పట్టింది. క్రీస్తు బోధనలు భూమికి చేరుకోవడానికి సమయం పడుతుంది.” అని ఆయన రాశారు. ఇదంతా సమయం అనే విషాదాంత అపార్ధం వల్ల ఉద్భవించింది. ఇది ‘సమయమే అన్నిటికీ పరిష్కరిస్తుంది’ అనే నిర్హేతుకమైన భావన. నిజానికి సమయం తటస్థమైనది. దానిని మనం నిర్మాణాత్మకంగా గానీ, విధ్వంసకరంగా గానీ వాడుకోవచ్చు. సమయాన్ని దుర్మార్గులు వాడుకున్నంత బాగా సన్మార్గులు వాడుకోలేకపోయారని నాకు అనిపిస్తున్నది. ఈ తరంలో కేవలం దుర్మార్గుల దౌష్ట్యం, దూషణపూరిత పదజాలం పట్లనే గాక, మంచివారు నోరెత్తకపోవడం గురించి కూడా మనము పశ్చాత్తాపం చెందవలసి వస్తున్నది. మానవ పురోగతి అనివార్యంగా ముందుకు సాగదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రభువుతో పాటే పనిచేసే సహాధ్యాయుల అలుపెరుగని ప్రయత్నాలు, నిరంతర శ్రమ వల్లనే అది సాధ్యం అవుతున్నది. ఆ విధమైన కఠోర పరిశ్రమ లేకపోయినట్లయితే సమయం తనంతట తానే సమాజంలో స్తబ్దత కల్గించే శక్తులతో చేతులు కలుపుతుంది.

బర్మింగ్ హాంలో మా చర్యలు తీవ్రమైనవి అని మీరు మాట్లాడారు. తోటి పెద్దమనుషులు అహింసాత్మక ప్రయత్నాలను ఉగ్రవాదచర్యలుగా పరిగణించడం పట్ల మొదట నేను హతాశున్నయ్యాను. నీగ్రో సమాజంలోని రెండు భిన్న ధృవాల మధ్య నిలబడి నేను ఈ విషయం గురించి ఆలోచించాను. అనేక సంవత్సరాలుగా అణచివేతకు గురై తమ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కోల్పోయి … ఇది ఇంతే అనే భావనతో వేర్పాటు భరించడానికి అలవాటుపడిన నీగ్రోలు ఒకవైపు … పెద్ద చదువులు చదివి ఆర్థికంగా స్థిరపడి, వేర్పాటు వల్ల లబ్ది పొందిన కొంతమంది మధ్యతరగతి నీగ్రోలు మరొకవైపు ఉండి జనసామాన్యపు సమస్యల పట్ల అచేతనంగా మొద్దుబారిపోయారు. దేశంలో తలెత్తుతున్న నల్లజాతి జాతీయ ఉద్యమాలలో అతిపెద్దది, అందరికీ తెలిసినది ఎలిజా ముహమ్మద్ యొక్క ముస్లిం ఉద్యమం. జాతి వివక్షత అంతులేకుండా కొనసాగడంపై ఈ సమూహంలోని ప్రజలు అమెరికా పట్ల తమ విశ్వాసాన్ని కోల్పోయారు. వారు క్రైస్తవ మతాన్ని సంపూర్ణంగా నిరాకరిస్తారు. శ్వేతజాతీయులు అంటే బాగుపరచలేని రాక్షసులు అనే నిర్ణయానికి వారు వచ్చారు. నేను ఈ రెండు శక్తుల మధ్య నిలబడే ప్రయత్నం చేశాను. ఇది ఇంతేలే అనే నిరాసక్తతను గానీ, నల్లజాతి జాతీయవాదుల విద్వేషాలను గానీ పట్టించుకోవాల్సిన అవసరంలేదని నేను చెబుతూవస్తున్నాను. ప్రేమ, అహింసాత్మక పద్ధతుల్లో నిరసనలు అద్భుతమైన మార్గాలు. నీగ్రో చర్చి ద్వారా అహింసాత్మక దృక్పథం మా పోరాటంలో అలవడినందుకు నేను ప్రభువుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ తాత్విక చింతన అలవడకపోయివున్నట్లయితే, ఈపాటికి దక్షిణాది రాష్ట్రాల్లోని వీధులన్నీ రక్తపుటేరులతో ప్రవహిస్తూ ఉండేవని నేను భావిస్తున్నాను. అహింసాయుతంగా ప్రత్యక్ష కార్యాచరణ చేపట్టిన మమ్మల్ని “అల్లర్లు సృష్టించేవారు, బయటి ఉద్యమకారులు” అనిపిలుస్తున్న శ్వేతజాతి సోదరులు మా అహింసాయుత ప్రయత్నాలకు మద్దతు నిరాకరిస్తే … మిలియన్ల కొద్ది నీగ్రోలు నిరాశా నిస్పృహలతో నల్లజాతి జాతీయవాద సిద్ధాంతాలలో స్వాంతన, రక్షణ కోరినట్లయితే … అది అనివార్యంగా ఒక భయానకమైన పీడకలను సృష్టిస్తుంది.

పీడిత ప్రజలు ఎల్లకాలం పీడితులుగానే ఉండరు.  ఏదో ఒక రోజున స్వేచ్ఛ కోసం వారు పరితపిస్తారు. అమెరికన్ నీగ్రోకు అదే జరిగింది. తన స్వాతంత్ర్యపు హక్కును సాధించుకొమ్మని అతని లోపల ఏదో అతన్ని హెచ్చరించింది. దానిని తాను సాధించుకోగలడని అది అతనికి గుర్తు చేసింది. చేతనంగానో, అచేతనంగానో జర్మన్లు “యుగధర్మం (Zeitgeist)” అని పిలిచినదాని విశ్వసంబంధమైన ఆవశ్యకతను అతను గుర్తించి, ఆఫ్రికాలోని తన సోదరులతో కలిసి … ఆసియా, దక్షిణ అమెరికా, కరీబియన్  లోని గోధుమ వర్ణం, పసుపు వన్నెసోదరులతో కలిసి జాతి న్యాయం లభించే ప్రదేశానికి దూసుకువెళ్తున్నాడు.  నీగ్రో సమాజాన్నిముంచెత్తిన ఈ అవశ్యమైన ఆవేశాన్ని గుర్తించి …  ప్రతి ఒక్కరూ ఈ ప్రజా ప్రదర్శనలను తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి. ఎంతో క్రోధాగ్నిని నీగ్రో తన లోలోపల అణచుకున్నాడు; పైకి కనబడని నిరాశా నిస్పృహలు ఎన్నో అతని హృదయాంతరాళలో దాగివున్నాయి. వాటన్నిటినీ అతను వెలుపలికి పంపవలసి వస్తున్నది. కాబట్టి అతన్ని ప్రదర్శనలు చేయనివ్వండి; సిటి హాలుకు ప్రార్ధనా తీర్థయాత్రలు నిర్వహించనివ్వండి;  అతను బైఠాయింపులు, స్వేచ్చా ప్రదర్శనలు ఎందుకు చేస్తున్నాడో అర్థం చేసుకోండి. అతనిలో దాగిఉన్న ఉద్విగ్నతలు ఈ విధమైన అహింసాత్మక పద్ధతుల్లో వెలివడకపోయినట్లయితే, అవి అశుభ సూచకములైన హింసాజ్వాలలుగా మారుతాయి.  ఇది బెదిరింపు కాదు; ఇది చారిత్రక సత్యం కాబట్టి మా వారికి “మీ అసంతృప్తిని తొలగించుకోండి” అని నేను చెప్పలేదు. కానీ సాధారణమైన, ఆరోగ్యకరమైన అసంతృప్తిని … అహింసాత్మక పద్ధతుల్లో ప్రత్యక్ష కార్యాచరణ అనే ఒక సృజనాత్మక వ్యక్తీకరణగా మలచవచ్చని చెప్పే ప్రయత్నం చేశాను. ఇప్పుడు మీరు దీనిని ఒక ఉగ్రవాద చర్యగా అభివర్ణిస్తున్నారు. ఆ విధమైన వర్గీకరణ పట్ల మొదట్లో నేను నిరాశచెందానని తప్పక ఒప్పుకోవాలి.

 కానీ ఆ విషయం ఆలోచించిన కొద్దీ … నన్ను ఉగ్రవాదిగా పిలవడం నెమ్మది నెమ్మదిగా నాకు కొంత సంతృప్తినిచ్చింది. ప్రేమను అధికంగా కోరుకున్న జీసస్ ఉగ్రవాది కాదా? … “మీ శత్రువులను ప్రేమించండి.  మిమ్మల్ని దూషించేవారిని ఆశీర్వదించండి. మిమ్మల్ని క్రూరంగా వాడుకునేవారి కోసం ప్రార్థన చేయండి.” న్యాయం కోసం పరితపించిన ఆమోస్ ఉగ్రవాది కాదా? –  “న్యాయం ఒక ప్రవాహం లాగా, ధర్మం ఒక గంగాఝరి లాగా జాలువారినివ్వండి.” జీసస్ క్రైస్ట్ సువార్తలు అందించిన పాల్ ఉగ్రవాది కాదా? –   “నా దేహంలో జీసస్ ప్రభువు గుర్తులను మోస్తున్నాను.” మార్టిన్ లూథర్ ఉగ్రవాది కాదా? –   “నేను ఇక్కడ నిలబడతాను. నేను మరేమి చేయలేను కాబట్టి నాకు సహాయం చేయి, భగవంతుడా!” జాన్ బన్యన్ ఉగ్రవాది కాదా? –  “నా అంతరాత్మను మోసగించే ముందు నా చివరి ఘడియల వరకు నేను జైలులోనే ఉంటాను.” అబ్రహం లింకన్ ఉగ్రవాది కాదా? –  “సగం  బానిసత్వం, సగం స్వేచ్ఛతో  ఈ దేశం మనుగడ సాగించలేదు. థామస్ జెఫర్సన్ ఉగ్రవాది కాదా? –  “మానవులందరూ సమానంగానే సృష్టించబడ్డారు అనే స్వతస్సిద్ధమైన సత్యాన్ని మనం స్వీకరించాలి.” కాబట్టి, మేము ఉగ్రవాదులం అవునా కాదా అనేది ప్రశ్న కాదు. కానీ మేము ఎలాంటి ఉగ్రవాదులమౌతాము అనేదే ప్రశ్న. మేము ద్వేషం కోసం ఉగ్రవాదులమవుతామా లేక ప్రేమ  కోసమా? మేము అన్యాయాన్ని రక్షించే ఉగ్రవాదులమవుతామా లేక న్యాయాన్ని రక్షించే ఉగ్రవాదులమవుతామా?

 శ్వేతజాతి మితవాదులు ఇదంతా అర్థం చేసుకోగలరని నేను ఆశించాను. బహుశా నేను చాలా ఆశాపూర్ణంగా ఉన్నానేమో. బహుశా నేను చాలా ఎక్కువగా ఆశించానేమో.  ఒక జాతిలోని కొంతమంది మరొక జాతిని పీడిస్తుంటే … పీడితుల తీవ్ర ఆర్తనాదాలు, వారి ఆవేశపూరితమైన పరితాపాన్ని అర్థం చేసుకుంటారని, స్పందిస్తారని అనుకోవడం అవివేకం అని నేను గుర్తించివుండవలసింది. దృఢమైన, నిరంతరమైన, పట్టుదలగల చర్య చేపడితే అన్యాయాన్ని మూలాలతో పెకళించవచ్చుననే విషయంపై వారిలో కొద్దిమంది దృష్టిసారించారు. ఈ సామాజిక విప్లవం యొక్క అర్థాన్ని ఆకళింపు చేసుకుని, దానికి బద్దులైవున్న కొద్దిమంది శ్వేతజాతి సోదరులకు నేను కృతజ్ఞుణ్ణి. రాశిలో చాల తక్కువే అయినా వాసిలో వారు ఎక్కువే.  రాల్ఫ్ మాక్ గిల్, లిలియన్ స్మిత్, హారీ గోల్డెన్, జేమ్స్ డాబ్స్ లాంటి వారు మా పోరాటం గురించి సుస్పష్టంగా చక్కటి అవగాహనతో భవిష్యత్తులో ఏం జరుగుతుందో రాశారు. మధ్యాహ్న భోజన సమయంలో వారు మాతో కలిసి ముచ్చటించారు. మా ప్రదర్శనలలో వారు పాల్గొన్నారు. బొద్దింకలు రాజ్యమేలే జైలు గదుల్లో వారు మాతో పాటే కృశించిపోయారు. “నీగ్రోలను ప్రేమించే వెధవల్లారా” అని కోపంతో పోలీసులు చేసే దుర్భాషలకు, తిట్లకు, క్రూరమైన బాధలకు వారూ లోనయ్యారు. ఇతర శ్వేతజాతి మితవాద సోదరుల వలె కాక వేర్పాటువాదం అనే జబ్బుకు విరుగుడు కాగల పటిష్టమైన “కార్యాచరణ” యొక్క తక్షణ అవసరాన్ని వారు గుర్తించారు.

 నేను నిరాశ చెందిన విషయం మరొక దానిని చెప్పనివ్వండి. నేను శ్వేతజాతీయుల చర్చి, దాని నాయకత్వం పట్ల కూడా నిరాశచెందాను. అందులో కొన్ని మినహాయింపులు ఉన్నాయనుకోండి. ఈ సమస్య పట్ల మీలో ఒక్కొక్కరు కొన్ని ప్రధానమైన నిర్ణయాలు తీసుకున్నారనే విషయం నేను మర్చిపోలేదు. రెవరెండ్ స్టాలింగ్స్, వేర్పాటు పద్ధతి పాటించకుండా గత ఆదివారం రోజున నీగ్రోలను బాప్టిస్ట్ చర్చి ప్రార్థనలకు ఆహ్వానించినందుకు నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. చాలా సంవత్సరాల క్రితం స్ప్రింగ్ హిల్ కాలేజ్ ను ఏకీకృతం చేసినందుకు ఈ రాష్ట్ర నాయకులను కూడా నేను అభినందిస్తున్నాను.

 కానీ పై మినహాయింపులు తప్ప  చర్చి పట్ల నేను నిరాశ చెందానని నిజాయితీగా నేను నొక్కి వక్కాణిస్తున్నాను. చర్చి పట్ల ఎప్పుడూ ఏదో ఒకటి తప్పుగా విమర్శించే వారిలాగా మాట్లాడడం లేదు. చర్చిని ప్రేమిస్తూ ఒక సువార్త ప్రచారం చేసే మినిస్టర్ గా, చర్చి గర్భంలో పెరిగిన వాడిగా, దాని ఆధ్యాత్మిక జీవనం గడిపిన వాడిగా, జీవితాంతం ఆ బంధం పెనవేసుకున్నవాడిలాగా నేను ఈ విషయం చెబుతున్నాను.

 కొన్ని సంవత్సరాల క్రితం, మాంటిగోమరి బస్ నిరసనలకు నాయకత్వం వహించడానికి అకస్మాత్తుగా నాయకత్వపు బరిలోకి నేను తోసి వేయబడినపుడు … శ్వేతజాతి చర్చి మాకు మద్దతునిస్తుందని ఆశించిన విషయంలో ఒక విచిత్రమైన భావనకు లోనయ్యాను. దక్షిణాదిలోని శ్వేతజాతి చర్చి మినిస్టర్లు, మతాచార్యులు, రబ్బీస్  మాకు పటిష్టమైన మద్దతు ఇస్తారని నేను ఆశించాను. దానికి బదులుగా కొంతమంది బాహటంగా మిమ్మల్ని వ్యతిరేకించారు. వారు  స్వేచ్ఛా ఉద్యమాన్ని అర్థం చేసుకునే బదులు, దానిని నిరాకరిస్తూ మా నాయకత్వాన్ని వక్రీకరించారు. ఇక చాలామంది ధైర్యం కన్న మిన్నగా చాలా జాగ్రత్తగా, నొప్పి తెలియకుండా రక్షణనిచ్చే రంగుటద్దాల కిటికీ వెనుక మౌనంగా ఉండిపోయారు.

 నా గత స్వప్నాలు భంగమైపోయినప్పటికీ, మా కోరికల్లో న్యాయాన్ని శ్వేతజాతి మతనాయకత్వం గుర్తించగలదు అనే ఆశతో నేను బర్మింగ్ హాం వచ్చాను. నైతిక బాధ్యతగా మా కోర్కెలను అధికార యంత్రాంగానికి విన్నవించడంలో వారు వారధిగా ఉండగలరని నేను ఆశించాను. ఈ విషయాన్ని మీలో ఒక్కొక్కరూ అర్థం చేసుకోగలరని ఆశించాను. కానీ నేను మళ్ళీ భంగపడ్డాను.

 ఎంతో మంది మతనాయకులు వేర్పాటువాదం చట్టవ్యతిరేకమైనది కాబట్టి దానిని పాటించకూడదు అని చెప్పారని విన్నాను. కానీ శ్వేతజాతి మినిస్టర్లు … ఏకీకృతం నైతికంగా ధర్మబద్దమైనదని, నీగ్రోలు తమ సోదరులని … అందువల్ల ఈ చట్టాన్ని పాటించమని చెబుతారని నేను చాలా రోజులుగా ఆశించాను. నీగ్రోలకు జరిగిన ఘోర అన్యాయాల పట్ల శ్వేతజాతి చర్చిలు పక్కకు వైదొలగి కేవలం అసంగతమైన పవిత్రనామాలు జపించడం, భక్తితత్పరత నటిస్తూ అల్పమైన పలుకులు పలకడం నేను గమనించాను. జాతి వివక్షత, ఆర్థిక అసమానతలను మనదేశం నుండి తొలగించే ఈ భారీ పోరాటం మధ్య “అవన్నీ సాంఘిక సమస్యలు. సువార్తలకు వాటికి సంబంధం లేదు.” అని ఎంతోమంది మినిస్టర్లు చెప్పడం నేను విన్నాను. దేహాలకు ఆత్మలకు మధ్య … పవిత్రమైనది, లౌకికమైనది అయిన ఓ వింత వ్యత్యాసాన్ని ఆపాదించిన పర ప్రపంచపు మతానికి పూర్తిగా కట్టుబడి ఉండడం ఎన్నో చర్చిల్లో నేను గమనించాను.

 ఒకప్పుడు చర్చిలు శక్తివంతంగా ఉండేవి. ఆ రోజుల్లో ఆది క్రైస్తవులు తాము అనుభవిస్తున్న బాధలకు తాము  అర్హులమేనని భావించేవారు. ఆనాటి చర్చి కేవలం అభిప్రాయ భావనలు, నియమాలను నమోదు చేసే ఒక ధర్మామీటర్ లాగా కాకుండా సమాజం యొక్క కట్టుబాట్లు, స్వరూపాన్ని మార్చే ఒక థర్మోస్టాట్ లాగా ఉండేది. ఎక్కడ క్రైస్తవులు అడుగుపెడితే అక్కడ అధికార వర్గాల్లో వణుకుపుట్టి వారు “శాంతి విధ్వంసకులు, బయటి ఉద్యమకారులు” అని వారిని శిక్షించాలని కోరుతూ ఉండేవారు. కానీ తామంతా “స్వర్గలోక సమూహము” అనే నమ్మకంతో మానవుడి ఆజ్ఞల కన్నా  భగవంతుని ఆజ్ఞలను పాటించాలని ఆ క్రైస్తవులు అనుకునేవారు. సంఖ్య చిన్నదే అయినప్పటికీ, వారి నిబద్ధత గొప్పగా ఉండేది. వారు ఎంతటి భగవంతుడి మత్తులో ఉండేవారంటే అసలు భయం అనేది ఏమిటో తెలియకుండా ఉండేవారు. భ్రూణహత్యలు, ముష్టియుద్దాల పోటీలు మొదలైన పురాతన పద్ధతులను వారు రూపుమాపారు.

 ఇప్పటి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. సమకాలీన చర్చి బలహీనమై, నిష్ఫలంగా జీరబోయిన గొంతుకతో అది చేసే శబ్దాలు ఏం చెబుతున్నాయో అర్థంకాని పరిస్థితి నెలకొనివున్నది. యధాపూర్వక స్థితి కొనసాగాలని అది కోరుకుంటున్నది. చర్చి యొక్క అస్తిత్వాన్ని పట్టించుకోని సాధారణ సమాజ అధికారవర్గం కూడా ఉన్నది ఉన్నట్టుగా ఉండాలనే చర్చి అభిప్రాయాలతో ఉపశమనం పొందుతున్నది.

కానీ, చర్చి పైన భగవంతుడి తీర్పు మున్నెన్నడూ లేని విధంగా ఉన్నది. ఒకవేళ ఈనాటి చర్చి ఆరోజుల్లోని చర్చి యొక్క బలిదానాల స్ఫూర్తిని పునర్నిర్మించుకోకపోయినట్లయితే … అది తన ప్రామాణికతను, మిలియన్ల మంది విశ్వాసాన్ని కోల్పోతుంది. ఇరవయ్యవ శతాబ్దంలో అర్థమూ పర్థమూ లేని పనికిరాని ఓ సామాజిక సమూహం లాగా ప్రజలు దానిని నిరాకరిస్తారు.

 ఈ నిర్ణయాత్మక ఘడియ సవాలును ఒక పెద్ద మొత్తంగా చర్చి స్వీకరిస్తుందని నేను భావిస్తున్నాను. ఒకవేళ న్యాయసహాయం కోసం చర్చి ముందుకు రాకపోయినా సరే భవిష్యత్తు గురించి నాకు నిరాశ లేదు. మా అభిమతాన్ని అపార్థం చేసుకున్నా సరే, మా బర్మింగ్ హాం పోరాటపు ఫలితాల గురించి నాకు భయం లేదు. అమెరికా గమ్యం స్వేచ్ఛ కాబట్టి అదే గమ్యాన్ని బర్మింగ్ హాం లోనే గాక, దేశమంతటా చేరుకుంటాము. మేము తిట్లకు, తిరస్కారాలకు గురి అవుతూ ఉండవచ్చు  కానీ మా గమ్యం అమెరికా గమ్యంతోనే ముడివడివున్నది. ప్లిమౌత్ లో యాత్రికులు కాలిడక ముందే మేమిక్కడ ఉన్నాము. ‘డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్’ పై జెఫర్సన్ సంతకం చేయకముందు రెండు శతాబ్దాల కాలం పాటు కూలీ వేతనం గురించి మా తాత ముత్తాతలు కష్టపడ్డారు. రాక్షసమైన అన్యాయాలు, సిగ్గుమాలిన అవమానాల మధ్య వారు వారి యజమానుల ఇళ్లు నిర్మించారు. ఒకవేళ వ్యక్తం చేయడానికి వీలులేని బానిసత్వపు క్రూర చర్యలను మేము అడ్డుకోలేక పోతే, ప్రతిపక్షాలు మమ్మల్ని తప్పకుండా విఫలుల్ని చేస్తాయి. మనదేశపు పవిత్ర వారసత్వసంపద, అంతులేని భగవంతుడి న్యాయం మా కోర్కెలను ప్రతిధ్వనిస్తున్నది కాబట్టి మేము స్వేచ్ఛను పొందగలము.

 ఇక నేను ముగించాలి. కానీ, ముగించే ముందు మీ వాంగ్మూలం లోని  నన్ను అత్యధికంగా బాధించిన విషయం ఒకటి ప్రస్తావించక తప్పదు. బర్మింగ్ హాం పోలీసులు “హింసను నిరోధిస్తున్నారు” అని, వారు “శాంతిభద్రతలు” కాపాడుతున్నారని మీరు ప్రశంసించారు. ఒకవేళ ఆ కోపిష్టి హింసాత్మక కుక్కలు (పోలీసులు) ఆయుధాలు లేకుండా అహింసాయుతంగా ప్రదర్శనలో పాల్గొన్న ఆరుగురు నీగ్రోలను వాస్తవంగానే కరిచారు అన్న విషయం తెలిసి ఉంటే మీరు పోలీసువారిని అదేవిధంగా పొగిడివుండేవారు కాదని నేను నమ్ముతున్నాను. ఈ సిటి జైలులో నీగ్రోల పట్ల వారి ఛండాలమైన, అమానవీయమైన ప్రవర్తనను గమనించి ఉంటే; ఒకవేళ వారు ముదుసలి నీగ్రో ఆడవారిని, నీగ్రో పడుచు పిల్లలని తిడుతూ తోసివేయడం చూసి ఉంటే; ముదుసలి మగ నీగ్రోలను, యువకులైన నీగ్రోలను కొట్టుకుంటూ, తన్నుతూ ఉండడం చూసి ఉంటే; రెండు సందర్భాల్లో మేము సామూహిక ప్రార్థనలకు సిద్ధమైనప్పుడు మాకు తిండిపెట్టడానికి వారు నిరాకరించడం మీరు గమనించివుంటే … అంత తొందర పడి మీరు పోలీసులను మెచ్చుకునే వారు కాదని నేను అనుకుంటున్నాను.

 ప్రదర్శనకారులను బహిరంగంగా నియంత్రించడంలో వారు తర్ఫీదు పొందివుండవచ్చుననేది నిజమే. ఈ అర్థంలో వారు బహిరంగంగా “అహింసాత్మకం.” కానీ దేనికోసం? క్రూరమైన వేర్పాటువాదాన్ని రక్షించడానికే కదా. మన అహింసాత్మక కోర్కెల గమ్యసాధన ఎంత పవిత్రమైనదో, దాని కోసం మనం ఎంచుకునే మార్గాలు కూడా అంత పవిత్రంగా ఉండాలని గత కొన్ని సంవత్సరాలుగా నేను పదేపదే బోధిస్తూ వచ్చాను. కాబట్టి నైతిక విలువల సాధనకు అనైతిక మార్గాలను ఎంచుకోవడం తప్పు అనే విషయం నేను స్పష్టం చేసే ప్రయత్నం చేశాను.

 ఉదాత్తమైన వారి ధైర్యానికి, కష్టాలను ఓర్చుకునేందుకు వారి సంసిద్ధతను అమానవీయంగా రెచ్చగొట్టినప్పటికీ వారు చూపిన క్రమశిక్షణను మీరు మెచ్చుకుని ఉంటే బాగుండేది అని నేను ఆశించాను. ఏదో ఒక రోజున దక్షిణాది రాష్ట్రాలు నిజమైన హీరోలను గుర్తిస్తాయి. ఒక మహనీయమైన లక్ష్య సాధనను ఎగతాళి చేస్తూ అరుపులు అరిచిన విరోధ అల్లరి మూకలను లెక్కచేయక ఒంటరిగా ఉద్యమించిన మార్గదర్శకుడు జేమ్స్ మెరిడితో లాగ వారంతా తయారవుతారు. అలబామాలో ఆత్మగౌరవం నిలబెట్టడానికి తమ వారందరితో కలిసి వేర్పాటు పద్ధతులని అవలంభిస్తున్న బస్సులో ప్రయాణం చేయము అని దీక్షబూని, “నా పాదాలు అలసిపోయింది, కానీ నా ఆత్మ విశ్రమిస్తున్నది.” అని వ్యాకరణ దోషంతో వ్యాఖ్యానించిన డెబ్భైరెండు సంవత్సరాల ఒక ముదుసలి స్త్రీలాగా … వారంతా కూడా ముదుసలి, అణగదొక్కబడిన, చితికిపోయిన నీగ్రో స్త్రీలు అందరికీ ప్రతీకగా నిలుస్తారు. వారంతా హైస్కూల్, కాలేజీలో చదువుకునే యువత, సువార్తలను అందించే మినిస్ట్రీస్, వారి కుటుంబంలోని పెద్ద మనుషులు అయి ఉంటారు. అంతరాత్మ ప్రబోధం విని వారంతా లంచ్ కౌంటర్లలో అహింసాత్మకంగా కూర్చుని, ఇష్టపూర్వకంగా జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉంటారు. ఈ భగవంతుడి బిడ్డలు ఆ లంచ్ కౌంటర్ల దగ్గర కూర్చొన్నప్పుడు … నిజానికి వారంతా ‘అమెరికన్ స్వప్నం’ కోసం, జూడా-క్రిస్టియన్ సంస్కృతి యొక్క అతి పవిత్రమైన విలువల కోసం నిలబడి ఉన్నారని … ఏదో ఒకరోజు దక్షిణాది రాష్ట్రాలు అర్థం చేసుకుంటాయి.

 ఇంత పొడవైన ఉత్తరం … లేదా పుస్తకం అనవచ్చేమో … నేను ఎన్నడూ రాయలేదు. మీ విలువైన సమయం ఎక్కువగా తీసుకునే అంత పెద్దగా ఈ ఉత్తరం ఉన్నందుకు నన్ను క్షమించండి. సానుకూలంగా ఒకవేళ ఒక బల్ల దగ్గర కూర్చుని ఉండే అవకాశం ఉండివుంటే తప్పకుండా ఈ ఉత్తరం చిన్నదిగానే ఉండివుండేది. కానీ, కాంతివిహీనంగా, విసుగుపుట్టించేలా ఉన్న జైలుగదిలో ఎన్నో దివారాత్రులు ఒంటరిగా కూర్చుని పొడవైన ఉత్తరాలు రాయడం, వింతైన ఆలోచనలు చేయడం, చాలా సేపు ప్రార్థనలు చేయడం తప్ప మరేం చేయగలం?

 ఒకవేళ ఈ ఉత్తరంలో వాస్తవ విరుద్ధమైన విషయం ఏదైనా నేను చెప్పి ఉన్నట్లయితే అది అనుచితమైన అసహనానికి గుర్తు అయినట్లయితే నన్ను క్షమించమని కోరుతున్నాను. ఒకవేళ ఈ ఉత్తరంలో వాస్తవాన్ని అతిశయోక్తిగా చెప్పి ఉన్నట్లయితే, అది నా సహనానికి గుర్తు అయినట్లయితే … సౌభ్రాతృత్వం పట్ల సహనంగా నన్నుఉండగలిగేటట్లుగా చేసినందుకు నన్ను క్షమించమని నేను భగవంతుని కోరుకుంటున్నాను.

 శాంతి, సౌభ్రాతృత్వం కోసం నిలబడే మీ వాడు,

మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్

Posted in ఉత్తరాలు, తెలుగు, Uncategorized | Leave a comment

గర్భసంచిని కాపాడుకుందాం … సమాజాన్ని బలపరుద్దాం

*****సామాజిక భాద్యత*****
పుస్తక పరిచయం: గర్భసంచిని కాపాడుకుందాం … సమాజాన్ని బలపరుద్దాం
పరిచయకర్త: చింతకుంట్ల సంపత్ రెడ్డి
____________________________________________________
ఓ సారి మాటల సందర్భంలో ప్రముఖ రచయిత, Tummeti Raghothama Reddy గారు మానవ సంభందాల గురించి ప్రస్తావిస్తూ….. మనిషి రెండు భాద్యతలు నిర్వర్తించాల్సి ఉంటుందని చెప్పారు. అందులో మొదటిది …. తల్లిదండ్రులను చూసుకోవాల్సిన భాద్యత…. రెండవది…. సామాజిక భాద్యత.

సామాజిక భాద్యతను నూటికి నూరు పాళ్ళు ఓ యజ్ఞంలా నిర్వహించే డా. S. V కామేశ్వరి కత్తి (scalpel) వదలి కలం ఝుళిపిస్తున్నది.

చూస్తేనే, ఈమే “మా అమ్మ” అనిపించే రూపం ఆమెది. కళ్ళల్లో కరుణ ఉట్టిపడే ఆ మాతృమూర్తి హృదయం, స్త్రీల పట్ల జరుగుతున్న అన్యాయాల్ని చూడలేక కన్నీరు కారుస్తున్నది. ఆ కన్నీళ్ళే “LET IT FLOW” అంటూ నినదిస్తున్నాయి. వయసు దాటిపోయి, నిస్పృహలో వున్న కొన్నివేల మందిని (6000 పైగా మందికి) అమ్మలను చేసిన ఆ అమ్మ …. మరి కొన్ని…. వేలల్లో కాదు…. కొన్ని లక్షల్లో ….. స్త్రీలను కాపాడ్డానికి కంకణం కట్టుకొన్నది. ఆ కంకణధారిని చేయి పట్టుకొని నడిపిస్తున్నది, ఆమె జీవితసహచరుడు డా. వింజమూరి సూర్యప్రకాశ్.

సామాజిక స్పృహ వున్నవారెవరూ ఈ ప్రవాహాన్ని (LET IT FLOW) ఆపొద్దు…… ఆపనీయెద్దు. ఆ FLOW ఏమిటో తెలుసుకోవడానికి, ఈ పుస్తకం చదవండి….. చదివించండి…. చదివి వివరించండి…… మీ సామాజిక భాద్యతని నిర్వర్తించండి. వివరాలకు ఈ ఫోటోలను చూడండి. మరిన్ని వివరాలకు పుస్తకం చదవండి.

Posted in Uncategorized | Leave a comment

ఉపన్యాసం-20: నా దురదృష్టం గురించి చింతించకండి

ఉపన్యాసం-20: నా దురదృష్టం గురించి చింతించకండి
వక్త: నెపోలియన్ బోనపార్టే
సంక్షిప్త స్వేచ్చానువాదం: చింతకుంట్ల సంపత్ రెడ్డి
మూలం: ఇంగ్లీష్
=======================================

నేపథ్యం:
———–
చతుష్షష్ఠి కళలు ….. అంటే 64 కళలు!
అందులో యుద్ధవిద్య కూడా ఒక కళనే అట!

సాధారణ సైనికుడి హోదాలో సైన్యంలో చేరిన నెపోలియన్ అంచెలంచెలుగా ఎదిగి, ఓ దశలో ఫ్రెంచ్ చక్రవర్తిగా ప్రకటించుకొన్నాడు!

సుమారు 50 యుద్దాల్లో మునిగితేలిన నెపోలియన్ యుద్ధకౌశలాన్ని గొప్పగా చెప్పుకుంటూ, ఇప్పటికీ మిలిటరి శిక్షణలో అతని వ్యూహాలను భోదిస్తుంటారట!

ఆ సమయంలో, “ప్రజలకు కావాల్సింది సమానత్వం కానీ స్వేచ్చ కాదు.” అని వ్యాఖ్యానించిన నెపోలియన్ ఫ్రాన్స్ ను ఒక బలమైన రాజ్యంగా చేయడానికి శ్రమించాడు. అతని సాంఘిక, ఆర్ధిక సంస్కరణలు ప్రపంచ చరిత్రలో నిలిచిపోయినవి.

5 లక్షల మంది సైనికులను సిద్దం చేసుకుని యూరప్ దేశాలను గడగడలాడించిన నెపోలియన్ సరియైన అంచనావేయకుండా 1812 లో రష్యాపై దండెత్తాడు. రష్యాలోని చలిని తట్టుకోలేక, ఫ్రెంచ్ సైన్యాలకు ఆహారం దొరకకుండా చేయడానికి రష్యన్లు పంటలను తగులబెట్టడం వల్ల, తిండి దొరకక లక్షాలాది మంది సైనికులు చనిపోయారు. చేసేదిలేక నెపోలియన్ సైన్యాలను వెనక్కి పిలిచాడు. తర్వాత మళ్ళీ సైన్యాన్ని పునర్నిర్మించుకుని కొన్ని చిన్న విజయాలు సాధించినప్పటికీ అతన్ని ఒక్కణ్ణి ఎదుర్కొనేందుకు రష్యా, ఇంగ్లాండ్, ఆస్ట్రియా, స్వీడన్ దేశాలు ఒక్కటై 1813 లో “లీప్జిగ్ యుద్ధం” లో అతన్ని ఓడించారు. ఫలితంగా, నెపోలియన్ ను చక్రవర్తి బిరుదుతో ఎల్బా అను చిన్న దీవికి పాలకునిగా పంపివేశారు.

“ఓల్డ్ గార్డ్” అనేది నెపోలియన్ సైన్యంలో ఒక ప్రత్యెక హోదా వున్న సైనిక విభాగం. ‘అసంభవం’ అనేది ఫ్రెంచ్ డిక్షనరిలోనే లేదు అని ప్రకటించిన నెపోలియన్ ఎల్బా దీవికి పంపబడేముందు ఓటమి అనేది ‘సంభవమే’ అని భావించి తన “ఓల్డ్ గార్డ్” సైనికులకు ఇచ్చిన సందేశం ఇది.

●◆●

(ప్రసంగ పాఠం)


ఏప్రిల్ 20, 1814

నా ఓల్డ్ గార్డ్ సైనికులారా,

నేను మీకు వీడ్కోలు చెప్తున్నాను. ఇరవై సంవత్సరాల పాటు మన విజయాల బాటలో నేను మీతో వున్నాను. మన భాగ్యవంతంగా వున్న రోజుల్లోలాగానే, ఇటీవలి రోజుల్లో కూడా అచంచలమైన ధైర్యానికి, విశ్వాసానికి ప్రతీకలుగా నిలిచారు. మీలాంటివాళ్ళుంటే, మనం నమ్మినదాన్ని సాధించకపోవడమనేది వుండదు; కానీ ఈ యుద్దం ఎడతెగకపోవచ్చు; ఇది అంతర్యుద్ధంగా మారవచ్చు. అది ఫ్రాన్స్ దేశానికి శాశ్వతవిపత్తును కొనితేవచ్చు.

నేను నా సర్వసాన్ని దేశ ప్రయోజానాలకు ధారపోశాను.

నేను వెళ్ళిపోతాను, కానీ స్నేహితులారా, మీరు ఫ్రాన్స్ దేశానికి సేవలను అందిస్తూనేవుంటారు. నేను కేవలం ఆమె సంతోషాన్ని మాత్రమే కోరుకొన్నాను. ఇంకనూ అదే నా ధ్యేయంగా వుంటుంది. నా దురదృష్టం గురించి చింతించకండి. ఒకవేళ నేను జీవించిఉండడానికి ఒప్పుకున్నానంటే, అది మీ విజయాలకు నివాళులు అర్పించడానికే. మనము కలిసి సాధించిన ఘన విజయాల చరిత్రను వ్రాయాలని నేను అభిలషిస్తున్నాను. సెలవు, మిత్రులారా, మిమ్మల్నందరినీ నా గుండెకు హత్తుకోవాలని వున్నది. కనీసం మీ సైనిక చిహ్నాన్ని ముద్దిడనివ్వండి.

●◆●

ముగింపు:
————-

నెపోలియన్ సందేశం విన్న సైనికులు ఉద్వేగంతో కళ్ళనీళ్ళ పర్యంతం అయ్యారట! పెటిట్ అనే జనరల్ ముందుకు రాగా అతణ్ణి హత్తుకుని, సైనిక చిహ్నాన్ని ముద్దాడట!

మరికొంతకాలం తర్వాత, ఎల్బా దీవి నుండి పారిపోయి వచ్చి, నెపోలియన్ తననుతాను తిరిగి రాజుగా ప్రకటించుకున్నాడు. కానీ, ఆ తర్వాత అతని పాలన 100 రోజులు మాత్రమే కొనసాగింది. సంయుక్త సైన్యాలు మళ్ళీ ఒక్కటై “వాటర్ లూ” అనే చోట 1815 లో జూన్ 18 న జరిగిన యుద్దంలో అతణ్ణి ఓడించారు. పరాజితుడైన నెపోలియన్ ను ఈసారి సెయింట్ హెలీనా లో రాకీ దీవి కి పంపించారు. తీవ్ర అనారోగ్యంతో అతను అక్కడే మరణించాడు.

నెపోలియన్ ఓటమి నేపధ్యంలో ….. ఇంగ్లీష్ భాషలోకి “meet (one’s) waterloo” అనే ఒక జాతీయం (idiom) కూడా చేరింది. దాని అర్థం “ఘోర పరాజయాన్ని ఎదుర్కోవడం” అని.

———————————————-

(ఈ ఉపన్యాసం “నెచ్చెలి” అంతర్జాల పత్రికలో అచ్చయింది. )

#########################
చింతకుంట్ల సంపత్ రెడ్డి
గురువారం, 19 మార్చి 2020

Posted in ఉపన్యాసాలు, తెలుగు, Uncategorized | Leave a comment