An Apple from Paradise (ఆఫ్గాన్ సినిమా పరిచయం)

An Apple from Paradise (ఆఫ్గాన్ సినిమా పరిచయం)

సినిమా నిడివి: 85 నిమిషాల 15 సెకండ్లు

పరిచయకర్త: సంపత్ రెడ్డి చింతకుంట్ల

15 February, 2017

*********************************************************************

రష్యా దేశంలోని Kazan పట్టణంలో జరిగిన International Muslim Film Festival లో ప్రదర్శించబడ్డ An Apple from Paradise అనే చిత్రం పలువురి ప్రశంసలు అందుకొన్నది. ఆఫ్గనిస్తాన్ ను రష్యా ఆక్రమించుకొన్న రోజులను నేపథ్యంగా తీసుకుని స్క్రిప్ట్, దర్శకత్వం నిర్వహించి Homayun Moravat తీసిన ఈ చిత్రం మూడు (Best film – Didor International Film Festival, Tajikistan, 2009; Best Film – Tolo TV FF, Afghanistan, 2009; Best Feature -Amatyn IFF, 2010) అవార్డులను గెలుచుకొన్నది.

మత మౌడ్యం ఎలా వుంటుందో, అందులోనూ ఛాందసవాదులు ఎలా వుంటారో. మతం, యుద్దాలు మన జీవితాల్లో ఎంతటి విషాదాన్నినింపగలవో సూత్రప్రాయంగా స్పృశించిన ఈ సినిమా ఆఫ్గనిస్తాన్ రాజధాని, కాబూల్ కేంద్ర బిందువుగా కొనసాగుతుంది.

“సినిమాలో చూపించబడ్డ మతం ఇస్లాం. కాని సినిమా టైటిల్ మాత్రం బైబిల్ కి సంబందించింది. హీరోలకేమో యూదుల పేర్లున్నాయి.” అని చెప్తూ యుద్ధం చూపించకుండా యుద్దపలితాలు చూపించడమే తన ఉద్దేశ్యం అని అంటాడు దర్శకుడు. మతాలన్నీ ఒకే సూత్రం మీద నడుస్తాయని అతని అభిప్రాయం కాబోలు. సినిమాలో మహిళా పాత్రలు ఎందుకు లేవు అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ, “అది నా ఆక్షేపణ. ఎందుకంటే, మా సమాజంలో (ఆఫ్గనిస్తాన్ లో) మహిళలు లేరు. పార్లమెంటులో కూడా వాళ్ళ ఉనికి నామమాత్రంగా వుంది.” అంటాడు అతను.

ఇక కథ, యాకుబ్ అనే వృద్దుడు కాబూల్ కి వెళ్ళే ప్రయాణంతో మొదలవుతుంది. సినిమా అంతా చాలావరకు బూడిదరంగు నిండుకొని, ఎక్కడా మరొక రంగు డామినేట్ చేయకుండా, కావాలని ……. విషాదం అలముకొన్నట్టు తీయడంలో దర్శకుడు, చాయచిత్రగ్రాహకులు సఫలమయ్యారు. మొదట్లో వున్న గాంభీర్యత సడలి, దైన్యాన్ని కళ్ళల్లో నింపుకొని, అవరోదాల్లా కనుపించే ఎత్తయిన మట్టిగోడల మధ్య, ఆ చిత్తడి నేలపై, చలిలో గజ గజ వణుకుతూ నడుస్తూ వెళ్ళే ఆ వృద్దున్ని చూస్తే ఎవరికైనా జాలి కలుగక మానదు. కాని, అసలు వైరుధ్యమంతా ఏమిటంటే ఆ వృద్దుడే మత ఛాందసవాదానికి ప్రతీక. ఇద్దరు కొడుకుల్ని సంతోషంగా ఇదివరకే సూసైడ్ బాంబర్లుగా ‘జీహాద్’ కి బలిదానం ఇచ్చినప్పటికీ, చివరి కొడుకును తన వూళ్ళోనే ముల్లా చేయాలని అనుకొన్న యాకుబ్, కాబూల్ లోని మదరసా పర్యవేక్షకుడు చివరి కొడుకును కూడా ‘జీహాద్’ బాట పట్టించాడని తెలిసినప్పుడు మాత్రం క్రుంగిపోతాడు. ఆ కొడుకును ఆ దారినుండి తప్పించడానికి తపిస్తూంటాడు. అనేక ప్రయత్నాలు చేసి, చివరకు తన కొడుకును తీసుకు వెళ్ళిన తీవ్రవాదులను కలుస్తాడు. అప్పటికే తన కొడుకు మరణించిన విషయం తెలియని యాకుబ్ తీవ్రవాదులను బతిమిలాడుతాడు. ఆ ప్రయత్నంలో, తీవ్రవాదులు అతన్ని కూడ కొడుకు దగ్గిరకు పంపివేయమని వాళ్ల అనుయాయులకు ఆదేశాలిస్తారు. అట్లా, తన అస్తిత్వాన్ని కోల్పోయిన ఆ వృద్దుడు ఆపిల్ పండును చూపుతూ కాబూల్ వీదుల్లో పిచ్చివాడుగా తిరుగుతూన్నట్టు చూపించడంతో సినిమా ముగుస్తుంది.

ఆ విధంగా తండ్రి ప్రేమ, మత విశ్వాసం, రెండింటి మధ్య నలిగిపోయిన వృద్దుని పాత్ర పోషించిన Rajab Gussainov నిస్సందేహంగా ఒక విలక్షణమైన నటుడు. సినిమాలోని కీలక అంశాలని గమనించడానికి మనం ముఖ్యంగా ఆ వృద్దుడు టాక్సీ డ్రైవర్ తోనూ, అలాగే పోలీస్ స్టేషన్ లో ఆఫీసర్ తోనూ మాట్లాడే విషయాలని శ్రద్దగా వినాలి. అయితే, త్వరత్వరగా కదిలిపోయే ఇంగ్లీష్ సబ్-టైటిల్స్ ను జాగ్రత్తగా చూడాలి. ఎలాగూ యూ-ట్యూబ్ లోనే చూస్తారు కాబట్టి, పాజ్ చేస్తూ కాని, లేదా మళ్ళీ వెనక్కి వెళ్లి కాని చూడాల్సి రావచ్చు.

ఆ వృద్దుడు ఆపిల్ పండుని తన మూటలో పెట్టుకుని, తనకు ఆకలివేస్తున్నా దాన్ని తినకుండా తన కొడుకును కలిసే ప్రయత్నంలో చివరిదాకా దాన్ని తన మూటలోనే ఉంచుకోవడం, ఆఖరి క్షణాల్లో అది ఆ మూటలోంచి దూరంగా పడిపోవడం అనేది adam and eve లు తిన్న forbidden fruit కి సింబాలిక్ గా చూపుతూ, మతం ఓ మత్తుమందులాంటిది అని సందేశాత్మకంగా చూపిస్తాడు దర్శకుడు. ఈ సినిమా చూసి మత ప్రాతిపదికన జరిగే యుద్దాలు మారణహోమాన్ని తీసుకువచ్చే “యముని మహిషపు లోహఘంటలు” అని అనుకోకుండా వుండలేము.

****************************************************************

యూ-ట్యూబ్ లో లభించే ఈ సినిమా చూడడానికి ఈ లింక్ కొట్టండి: https://www.youtube.com/watch?v=B6__wyFdUBM&list=WL&index=26

About saltnpepperdays

I am an EFL/ESL teacher from India. I am interested in teaching/learning to teach English. Photography and reading are my hobbies.
This entry was posted in తెలుగు, Movie Review. Bookmark the permalink.

Leave a comment