సినిమా పరిచయం : The Silence (ఇరానియన్ సినిమా) – 1998

సినిమా పరిచయం : The Silence (ఇరానియన్ సినిమా) – 1998
పరిచయకర్త: సంపత్ రెడ్డి చింతకుంట్ల
దర్శకత్వం: Mohsen Makhmalbaf
రచన తేది: 2 ఫిబ్రవరి, 2017
****
కొన్నిసార్లు మనచుట్టూ కాస్త నిశ్శబ్దం వుంటే బాగుండును అని అనుకొంటాం. కాని అదే నిశ్శబ్దాన్ని ఎక్కువసేపు భరించడం మాత్రం కష్టం. శబ్దం, నిశ్శబ్దం మధ్య మన జీవనపోరాటం కొనసాగుతూంటుంది. ఈ పోరుబాటలోని సంగీతప్రవాహంలో కొట్టుకునిపోయే పదేళ్ళ అంధబాలుడు కోర్శేద్ (Korshed). ఈ బాలుడి జీవితంలోని నాలుగురోజుల కథే The Silence. సంభాషణలు తక్కువగానే వున్నా, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ వున్నాయి.
ఏ వస్తువు “….. కవితకనర్హం…” కాదు అన్నట్లుగా, ప్రతి వస్తువులోనూ సంగీతం తొంగిచూసే ఈ సినిమాలో తలుపు తట్టడం, తుమ్మెద ఝంకారం, నీటి గలగల, వర్షపు చప్పుడు, గుర్రపు పరుగు, శ్రమజీవి ఉచ్వాస నిశ్వాసాలు మొదలైన వాటిల్లో సంగీతాన్ని ఆస్వాదిస్తుంటాడు కోర్శేద్. ఈ గుడ్డి పిల్లవాడి పరవశానికి మనమూ వశమైపోయి…… ఆ శబ్దాల మాధుర్యంలో మనమూ మునకలు వేస్తూ, ఆద్యంతం ఓ సంగీతప్రపంచంలో ఓలలాడుతూ సుమారు 73 నిముషాల ఈ సినిమాని అలవోకగా ఆనందించవచ్చు.


కథాంశం:
కోర్శేద్ తండ్రి …… భార్యను, కోర్శేద్ ను వదలిపెట్టి రష్యాకు వెళ్ళిపోతాడు. ఆ పరిస్థితుల్లో, కోర్శేద్ మన తంబూర లాంటి tambourines అనే సంగీతవాయిద్యాలు తయారుచేసే చోట వాటిని ట్యూన్ చేసే పనిలో కుదురుతాడు. దూరంగా వున్న తమ ఇంటినుండి పట్టణంలో పనికి వెళ్ళడానికి బస్సులో ప్రయాణం చేయాల్సివుంటుంది. అదే యజమాని దగ్గర పనిచేసే అందమైన అమ్మాయి, నాలుగు జడల నదీర (Nadereh) ఇతన్ని బస్సు ఎక్కించడానికి సహాయం చేస్తూంటుంది.
అయితే, కోర్శేద్ కున్న బలహీనత సంగీతం. ఎక్కడ సంగీతం విన్నా, దాన్ని వెతుక్కుంటూ వెళ్లి దారితప్పి తరచుగా పనికి ఆలస్యంగా వెళుతుంటాడు. అందుకని మరే శబ్దాలు వినకుండా చెవుల్లో దూది పెట్టుకుని ప్రయాణం చేయమని నదీర అతనికి సలహా ఇస్తుంది. ఆ సలహా పాటించినప్పటికీ, ఓ జానపద సంగీతకారుని ప్రతిభకు ముగ్దుడై, అతన్ని వెతికేక్రమంలో మళ్ళీ పనికి ఆలస్యంగా వెళతాడు. అది భరించలేని యజమాని కోర్శేద్ ని ఉద్యోగం నుండి తొలగిస్తాడు. మరుసటిరోజు ఇంటి అద్దె చెల్లించకపోతే, ఇల్లు ఖాళీ చేయాల్సి వుంటుందని ఇంటి యజమాని హెచ్చరించటంతో, కోర్శేద్ తన ఆలస్యానికి కారణమైన ఆ జానపద సంగీతకారున్ని వెతికి తీసుకెళ్ళి, తన యజమానికి క్షమాపణ చెప్పే ప్రయత్నం చేస్తాడు. కాని, వాళ్ళు వెళ్ళేసరికే మరేదో కారణాలవల్ల ఆ యజమాని వ్యాపారం మానేసి వెళ్ళిపోతాడు. ఈ లోగా ఇంటి అద్దె గడువు దాటి పోతుంది. తాను కూడా డబ్బులు ఇచ్చి సహాయం చేయలేని పరిస్థితుల్లో, ఆ జానపద సంగీతకారుడు అతని మరో ఇద్దరు మిత్రులు ఇంటి యజమానిని మెప్పించడానికి సంగీతం వినిపిస్తారు. ఆ ప్రయత్నం విఫలమై ఆ యజమాని వీళ్ళ సామాన్లన్నీ బయట పడేస్తాడు. అలా కోర్శేద్ తల్లి తన సామాన్లతో బయల్దేరడం …. కోర్శేద్ ఆ సంగీతకారుల్ని గుర్రపు దౌడు సంగీతం వాయించమని చెప్తూ….. తాను గుర్రంలాగా దౌడు తీస్తూ, తన ఊహాల్లోకి వెళ్ళిపోవడం ….. ఆ ఊహల్లోనే, పట్టణంలోని అంగడి ప్రాంతంలోని ఇత్తడి పరిశ్రమ పనివాళ్ళంతా తన సంగీత దర్శకత్వంలో లయబద్దంగా తమ పనుల్ని చేసుకుంటూ వుండడం మొదలైన అంశాలతో సినిమా ముగుస్తుంది.
***
నాకు నచ్చిన మరి కొన్ని అంశాలు:
1. ఒకసారి కోర్శేద్ బస్సులో వెళ్ళేపుడు ఇద్దరు విద్యార్థులు ఓ పాఠాన్ని బట్టీ పడుతుంటారు. అది విన్న కోర్శేద్ ఆ పాఠాన్ని వెంటనే అప్పజెపుతాడు. అది ఎలా సాధ్యమని అడిగితే, “మీ కళ్ళు మిమ్మల్ని దృష్టి మళ్ళిస్తాయి. కళ్ళు మూసుకుని చదివితే బాగా అర్థమవుతుంది.” అని చెప్తాడు.
2. రెండు జళ్ళ సీత అంటే మనకు ఓ అందమైన చిన్నారి గుర్తుకొస్తుంది. ఇందులో నదీర నాలుగు జడలతో …. ముందు రెండు, వెనక రెండు జడలతో ఉండే చిన్నారి. చాల అందంగా వుండి, గుండ్రటి మొహంతో ఉండే నదీర తన చెవులపై ఇటు రెండు, అటు రెండు చెర్రీ ఫళ్ళు పెట్టుకుని మొహాన్ని అటూ ఇటూ తిప్పుతూ చేసే నృత్యం చూడవలసిందే. ఆ సీన్లో ఫోటోగ్రఫి అత్యద్భుతంగా వుంది. ఇక దర్శకుడి ప్రతిభ సినిమాలోని అడుగడుగునా కనపడుతుంది.


3. సినిమా మొత్తంలో కోర్శేద్ పాత్ర ఎక్కడా ఎలాంటి హావభావాలు చూపించదు. సంగీతం ఒక్కటే అతని ప్రపంచం. ఆనందం, విచారం ….. అన్నిటికీ అతీతం …. అది సంగీత ప్రపంచం. తనదైన ప్రపంచంలో అలా ఒక వ్యక్తి మనగలగడం …. పిల్లలకి, పెద్దలకి గొప్ప స్ఫూర్తి కలిగించే ఒక అద్భుత కావ్యం, The Silence.
ఈ లింక్ కొట్టి మీరూ You Tube లో ఈ సినిమాను చూడవచ్చు: https://www.youtube.com/watch?v=-fZVrBa8iGQ

About saltnpepperdays

I am an EFL/ESL teacher from India. I am interested in teaching/learning to teach English. Photography and reading are my hobbies.
This entry was posted in Movie Review, Uncategorized. Bookmark the permalink.

Leave a comment